ఎన్డీయేలోకి జేడీఎస్ ! ఢిల్లీలో అమిత్ షాతో కుమారస్వామి సీట్ల చర్చలు..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఏకపక్ష విజయం విపక్ష పార్టీలైన బీజేపీ, జేడీఎస్ లను దగ్గర చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలో ఉమ్మడిగా పోటీ చేయకపోతే కాంగ్రెస్ చేతిలో మరోసారి దెబ్బతినడం ఖాయమనే అంచనాకు వచ్చేసిన జేడీఎస్, బీజేపీ ఇప్పుడు దగ్గరయ్యాయి. ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో కలిసిన జేడీఎస్ నేత కుమారస్వామి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలతో ఎన్డీయేలోకి జేడీఎస్ చేరిక ఖాయం కావడంతో పాటు సీట్ల పంపకాలు కొలిక్కి రానున్నాయి.
ఇవాళ ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో కలిసిన కుమారస్వామి పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, ఉమ్మడి ప్రచారం వంటి పలు అంశాలపై మాట్లాడారు. బీజేపీ గతంతో పోలిస్తే కర్నాటకలో బాగా బలహీన పడిందన్న సంకేతాల నేపథ్యంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ తో పొత్తు అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత కుమారస్వామి ఎన్డీయేలో జేడీఎస్ చేరికను ప్రకటించారు.

కర్నాటకలో కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే అనుసరించాల్సిన వ్యూహంపై గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోనే చర్చలు జరుపున్న కుమారస్వామి.. పొత్తు విషయాన్ని మాత్రం వెల్లడించలేదు . ఇప్పటివరకూ ఇంకా పొత్తు కుదరలేదని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమిత్ షా భేటీ అయిన కుమారస్వామి పొత్తుపై ప్రకటన చేశారు. అయితే బీజేపీతో ఒప్పందంలో భాగంగా ఎన్ని సీట్లు జేడీఎస్ తీసుకుంటుందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్ సభలో బలం పెంచుకోబోతున్న రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో కుమారస్వామితో పొత్తు పెట్టుకుని మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకోవాలని యోచిస్తోంది. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల రాజకీయాల్ని తిరస్కరించిన ఓటర్లు..లోక్ సభ ఎన్నికల్లోనూ అదే తరహాలో స్పందిస్తారన్న అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications