మాజీ డీజీపీ దారుణ హత్య, భార్యే నిందితురాలు!
కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) బెంగళూరులోని తన నివాసంలో శవంగా కనిపించాడు. ఆయన శరీరంపై పలు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఆయనది హత్యగా అనుమానిస్తున్నారు. మాజీ డీజీపీని హత్య చేసింది ఆయన భార్యే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో ఓం ప్రకాశ్‌ను ఆయన భార్య పల్లవి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. పది నుంచి 15 సార్లు ఓం ప్రకాశ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆస్తి కోసమే మాజీ డీజీపీని ఆయన భార్య హత్య చేసినట్లు తెలుస్తోంది.

కర్ణాటక కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాశ్.. 2017లో పదవీ విరమణ చేశారు. కాగా, 2015లో డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ, ఐజీపీ)గా విధులు నిర్వహించారు. ఆదివారం ఆయన తన ఇంట్లో రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించారు. మాజీ డీజీపీని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఆయన భార్య పల్లవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, ఓంప్రకాశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతోనే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఆర్థిక విషయాలే ఈ హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఓంప్రకాశ్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి.
బీహార్ రాష్ట్రంలోని చంపారన్‌కు చెందిన ఓంప్రకాశ్.. 1981 బ్యాచ్ ఐపీఎస్. ఆయన కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని హరపనహళ్లీలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్ మంగళూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సీఐడీ ఐజీపీ వంటి కీలక పదవులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications