
86ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి
ఛండీగఢ్: తమ కలలను సాకారం చేసుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలా మంది వృద్ధులైనప్పటికీ చదువులో తమకు ఒక పట్టా పొందేందుకు శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాయడం గమనార్హం. సిర్సాలోని ఆర్యకన్య సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఆయన ఈ పరీక్ష రాశారు.
ఈ ఏడాది మొదట్లోనే హర్యానా ఓపెన్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలను రాశారు ఓం ప్రకాశ్ చౌతాలా. అయితే, 10వ తరగతి ఉత్తీర్ణులు కాకపోవడంతో ఆయన ఫలితాలను ప్రకటించకుండా ఆగస్టు 5న నిలిపివేశారు. ఇంటర్ ఫలితాల కోసం ఆయన ఇప్పుడు 10వ తరగతి పరీక్షను రాయాల్సి వచ్చింది.

కాగా, పరీక్ష కేంద్రానికి వచ్చిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మాట్లాడుతూ.. తాను ఓ విద్యార్థినని, అంతకు మించేమీ లేదని చెప్పారు. ఇతర రాజకీయ పరమైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు. 86 ఏళ్ల వయస్సులో చౌతాలా 10వ తరగతి పరీక్షలు రాయడం విశేషం.
తన పరీక్షను రాసేందుకు తనకు సహాయకుడు కావాలని కోరాడంతో విద్యా శాఖ అందుకు అంగీకరించింది. దీంతో 2 గంటలపాటు పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి ఆ తర్వాత పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ఓం ప్రకాశ్ చౌతాలా తన 82 వ ఏట 2017 లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుండి 10 వ తరగతి పాసయ్యారు. ఆయన ఉర్దూ, సైన్స్, సోషల్ స్టడీస్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్‌లో 53.4 శాతం మార్కులను సాధించారు.
జేబీటీ రిక్రూట్‌మెంట్ స్కాం కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవించిన సమయంలో ఓం ప్రకాశ్ చౌతాలా 10వ తరగతి పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. ఈ స్కాంలో 2013 నుంచి జులై 2, 2021 వరకు ఆయన శిక్ష అనుభవించారు. 1999 నుంచి 2005 వరకు ఓం ప్రకాశ్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు.