జగ్మోహన్ మరణం దేశానికి గొప్ప నష్టం -మాజీ గవర్నర్, బీజేపీ వెటరన్‌కు ప్రధాని మోదీ నివాళి
జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ వెటరన్ జగ్మోహన్ మల్హోత్రా అలియాస్ జగ్మోహన్ ఇక లేరు. దేశంలో పట్టణాభివృద్దికి సంబంధించి సంచలన సంస్కరణలెన్నో తెచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న జగ్మోహన్ ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 94ఏళ్లు. కాగా, జగ్మోహన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగ ప్రకటన చేశారు..
సివిల్స్ అధికారిగా కెరీర్ ప్రారంభించిన జగ్మోహన్.. ఇందిరా హయాంలో పట్టణాభివృద్ధి శాఖ అధికారిగా ఢిల్లీ సహా పలు నగరాల రూపురేఖల్ని మార్చేశారు. వాజపేయి ప్రధాని అయ్యేనాటికి సర్వీసు నుంచి రిటైరైన జగ్మోహన్ బీజేపీలో చేరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, టూరిజం శాఖ మంత్రిగానూ పనిచేశారు. తర్వాతి కాలంలో ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, గోవా, జమ్మూకాశ్మీర్ లకూ గవర్నర్ గా వ్యవహరించారు.

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదం తీవ్రస్థాయిలో కొనసాగిన సమయంలో ఆ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన జగ్మోహన్ కు అప్పటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో నుంచి నేరుగా బెదిరింపులు రావడం, జగ్మోహన్ సైతం దీటుగా స్పందించడం అప్పట్లో సంచలన విషయం. పట్టణాభివృద్ధి రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం జగ్మోహన్ కు 1971లో పద్మశ్రీ, 1977లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. కాగా,
జగ్మోహన్ మల్హోత్రా అలియాస్ జగ్మోహన్ మరణం దేశానికి గొప్ప నష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ''ఆయన అద్భుతమైన పాలకుడేకాదు, ప్రఖ్యాత పండితుడు కూడా. ఎల్లప్పుడూ భారతదేశ హితం కోసమే పనిచేశారు. మంత్రిగా అతని పదవీకాలం వినూత్న విధాన రూపకల్పన దశగా గుర్తింపు పొందింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబీకులు, అభిమానులకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా'' అని ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications