విభజన మాజీ గవర్నర్ కన్నుమూత
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు తుదిశ్వాస విడిచారు.
1946 జూలై 24న ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లోని హిసావాడ గ్రామంలో జన్మించారు సత్యపాల్ మాలిక్. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. విద్యార్థి జీవితంలోనే రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఆయనను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత చౌదరి చరణ్ సింగ్‌కు దక్కుతుంది.

మాలిక్ 2018 ఆగస్టు నుండి 2019 అక్టోబర్ వరకు జమ్మూ కాశ్మీర్ కు గవర్నర్ గా పని చేశారు. ఆ రాష్ట్రానికి ఆయనే చివరి గవర్నర్. ఆయన పదవీ కాలంలోనే.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది.
ఆ తరువాత సత్యపాల్ మాలిక్ గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. 2022 అక్టోబర్ వరకు మేఘాలయ గవర్నర్‌గా పనిచేశారు. మాలిక్ రాజకీయ జీవితం 1970లలో సోషలిస్ట్ గా ప్రారంభమైంది. ఆయన 1974లో భారతీయ క్రాంతి దళ్ టికెట్‌పై ఉత్తర ప్రదేశ్ లోని బాగ్‌పత్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు.
అనంతరం లోక్‌దళ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1980 నుండి 1989 వరకు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్, జనతాదళ్ వంటి వివిధ రాజకీయ పార్టీలో కొనసాగారు. 2004లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2017లో ఆయన బీహార్ గవర్నర్‌గా, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా, 2019లో గోవా గవర్నర్‌గా, 2020లో మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఆ తరువత మోదీ ప్రభుత్వంతో ఆయన సంబంధాలు క్షీణించాయి. తన చివరి రోజుల్లో.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో చోటు చేసుకున్న భీకర ఉగ్రవాదదాడికి ప్రధానమంత్రి నరేంద్ర మో, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపించారు.
రైతు ఉద్యమం తర్వాత సత్యపాల్ మాలిక్, బీజేపీ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఢిల్లీ సరిహద్దుల్లో 700 మంది రైతులు చనిపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగిన తరువాత అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.












Click it and Unblock the Notifications