ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
Sai Baba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు.
కాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు.

ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. సాయిబాబాను 2014లో మావోయిస్టుల గ్రూపులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో యూనివర్సిటీ నుంచి సస్పెండయ్యారు. నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో ఆయనను ఉంచారు. మార్చి 2017లో మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబాకు మరో ఐదుగురు మావోయిస్టులు మహేశ్ తిర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీతో సంబంధాలున్నాయని తేల్చింది.
దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లు భావించే కార్యకలాపాలలో పాల్గొన్నందుకు దోషులుగా నిర్ధారించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాను ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషి అని ప్రకటించడంతో విడుదలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సాయిబాబా కన్నుమూశారు. సాయిబాబా మరణం పట్ల ప్రజా సంఘాల నేతలు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications