వీడు మామూలోడు కాదు! ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లాడాడు, హైదరాబాద్‌లోనూ
భువనేశ్వర్: నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇతడు అలాంటి ఇలాంటి నిత్య పెళ్లి కొడుకు కాదు. ఏకంగా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. 48 ఏళ్లు వచ్చినా పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తూనే ఉన్నాడు. అతనిపై ఫిర్యాదులు రావడంతో సోమవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.

తొలి రెండు వివాహాలు ఒడిశాలోనే.. ఐదుగురు పిల్లలు
ఈ నిత్య పెళ్లి కొడుకు గురించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడు 1982లో మొదటిసారి పెళ్లి చేసుకున్నాడని, 2002లో రెండో వివాహం చేసుకున్నాడని.... ఈ రెండు పెళ్లిళ్లలో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాష్ తెలిపారు. నిందితుడు ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని పట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఇతడు పారిపోయే ముందు బాధిత మహిళల నుంచి డబ్బు తీసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయని తెలిపారు.

చివరి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి నిత్యపెళ్లికొడుకు బాగోతం
2002-2020 మధ్య, అతను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా ఇతర మహిళలతో స్నేహం చేశాడు. తన ఇతర భార్యలకు తెలియకుండా వారిని వివాహం చేసుకున్నాడని దాష్ చెప్పారు. నిందితుడు ఢిల్లీలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న తన చివరి భార్యతో కలిసి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉంటున్నాడు. అతడికి ఇంతకుముందు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భువనేశ్వర్‌లో అద్దెకు ఉంటున్న అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకున్నాడు..
నిందితుడు తనను 2018లో న్యూఢిల్లీలో పెళ్లి చేసుకుని భువనేశ్వర్‌కు తీసుకెళ్లారని గతేడాది జులైలో బాధిత మహిళా పాఠశాల ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని డీసీపీ తెలిపారు.
నిందితుడి మోసం చేసే విధానం ప్రకారం.. అతను మధ్య వయస్కుడైన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడని, ఎక్కువగా వివాహిత వెబ్‌సైట్‌లలో సాంగత్యం కోరే విడాకులు తీసుకున్న మహిళలను ఎంచుకున్నాడని డీసీపీ తెలిపారు. అంతేగకా, అతను వారిని విడిచిపెట్టే ముందు వారి దగ్గర్నుంచి డబ్బు దోచుకునేవాడని తెలిపారు.

డాక్టర్ అని చెప్పుకుంటూ ఏడు రాష్ట్రాల్లో.., విద్యావంతులూ బాధితులే
నిందితుడు తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ.. న్యాయవాదులు, వైద్యులు, ఉన్నత విద్యావంతులైన మహిళలను వివాహం చేసుకున్నాడు. అతని బాధితుల్లో పారా మిలటరీ దళంలో పనిచేస్తున్న మహిళ కూడా ఉందని డీసీపీ దాస్ తెలిపారు. నిందితుడు ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లో మహిళలను మోసం చేశాడు. అతని మొదటి ఇద్దరు భార్యలు ఒడిశాకు చెందినవారు అని సదరు అధికారి వెల్లడించారు. .

హైదరాబాద్‌లోనూ అతడి మోసాలు
నిందితుడి 14 వివాహాల గురించి తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం, డబ్బు అప్పుగా తీసుకుని మోసం చేయడం వంటి నేరాలకు సంబంధించి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications