మగవారికి కూడా ఉచిత బస్సు అట- చూస్కోండిక: ఎక్కే బస్సు దిగే బస్సు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరీ పోరు సాగిస్తోన్నాయి.
ఈ క్రమంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శనివారం కీలక ప్రకటన చేశారు. అయిదు ఎన్నికల హామీలను ప్రకటించారు. పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కావడానికి ముందే ఈ ప్రకటన వెలువడింది. ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాల అనంతరం మరిన్ని హామీలు వెల్లడిస్తామని అన్నారు.

పళనిస్వామి ప్రకటించినవి..
'మగలిర్ కులవిళక్కు తిట్టం' పథకం: ఈ కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాల్లో నెలకు 2,000 రూపాయలు జమ చేస్తారు.
పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం: ప్రస్తుతం తమిళనాడులో సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు అమల్లో ఉంది. చెన్నై, మధురై వంటి నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో మహిళలకు జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణం అమలులో ఉంది. దీన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తారు.ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రాలు, సిటీబస్సుల్లో పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.
'అమ్మ గృహ పథకం': ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి స్థలంతో కలిపి ప్రభుత్వం కాంక్రీట్ గృహాలు నిర్మించి ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేసి బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లు నిర్మించి అర్హులకు కేటాయిస్తుంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వివాహిత కుమారులు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా నివాసం ఉంటే.. వారికీ స్థలం కొని కాంక్రీట్ ఇళ్లు ప్రభుత్వం కట్టిస్తుంది.
100 రోజుల ఉపాధి పథకం 150 రోజులకు పెంపు: వీబీజీ రామ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచగా, ఏఐఏడీఎంకే దీన్ని 150 రోజులకు విస్తరింపజేస్తుంది. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద తమిళనాడులో సంవత్సరంలో 150 రోజుల పాటు పని దినాలు లభిస్తాయి.
'అమ్మ టూ వీలర్ పథకం: ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అయిదు లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలు అందిస్తారు. దీనికోసం ఏఐఏడీఎంకే ప్రభుత్వం 25,000 రూపాయల సబ్సిడీని చెల్లిస్తుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుతో ఈ పథకం అమలవుతుంది. ఆమెకు గుర్తుగా అమ్మ పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications