శక్తిమంతమైన మోదీ మంత్రి పీఠాన్ని ముంచిన సునామీ- టైమ్ లైన్
ఓ చిన్న సెటైరికల్ సోషల్ మీడియా క్యాంపెయిన్.. దేశ రాజకీయాల్లో సునామీలా మారుతుందని బహుశా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఈ ఏడాది మే 15వ తేదీన ఓ ఆన్‌లైన్ పేజీగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. ఓ మహోద్యమంగా అవతరించింది. జస్ట్.. రెండున్నర నెలల వ్యవధిలో అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ ను కుదేల్ చేసింది. ఓ మంత్రి రాజీనామాకు కారణమైంది.
అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్త విద్యార్థులు, యువజన ఉద్యమంగా రూపాంతరం చెందింది. నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై విసిగిపోయిన యువతకు ఈ పార్టీ ఓ ఆశాకిరణంగా మెరిసింది. డిజిటల్ స్క్రీన్ల నుంచి దేశ రాజధాని వీధుల వరకు సాగిన ఈ పోరాట ప్రస్థానంలో క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖులు జతకూడటంతో కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రత ఒక్కసారిగా దేశమంతటా పెరిగింది.

పరీక్షా పత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత లోపాలపై యువత సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఉద్యమం ఒక నూతన ప్రజా గొంతుకగా నిలిచింది. నిద్రాణంగా ఉంటూ వచ్చిన యువశక్తిని తట్టిలేపింది. రాజ్యాంగ వ్యవస్థలను నిలదీసింది. వారి పోరాటానికి ఓ చుక్కానిలా మారింది. ఈ అసాధారణ పరిణామాల వెనుక ఒక బలమైన వివాదాస్పద నేపథ్యం దాగి ఉంది.
మే 15వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దీనికి మూలకారణంగా నిలిచాయి. నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు యువతలో తీవ్ర ఆవేదాన జ్వాలలను రేపాయి. తమను తక్కువ చేయడాన్ని నిరసిస్తూ మరుసటి రోజే అభిజీత్ డిప్కే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ సెటైరికల్ ఆన్‌లైన్ పేజీని ప్రారంభించారు.
ఇది.. దావానలంలా వ్యాపించింది. కేవలం నాలుగు రోజుల్లోనే అంటే.. మే 18 నుండి 21 మధ్యకాలంలో ఈ గ్రూప్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊహించని ప్రజాదరణ పొందింది. దాదాపు 1.7 కోట్ల నుంచి 2.25 కోట్ల మంది నెటిజన్లు దీనికి మద్దతు ప్రకటించారు. ఆన్‌లైన్ ఫాలోయింగ్‌కే పరిమితం కాకుండా.. సుమారు 40,000 పైగా నూతన సభ్యులు పార్టీలో అధికారికంగా డిజిటల్ రిజిస్ట్రేషన్ల ద్వారా చేరారంటే ఈ జెన్ జీకి ఉన్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ ప్రచార ఉధృతికి అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. నిబంధనల ఉల్లంఘన పేరుతో కాక్రోచ్ జనత పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ అకౌంట్ ను నిలిపివేసింది కూడా. దీంతో అభిజీత్ డిప్కే మే 26వ తేదీన నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భావప్రకటన స్వేచ్ఛ కోసం చట్టపరమైన పోరాటానికి కూడా తెరలేపారు.
అమెరికా నుంచి జూన్ 6న తిరిగొచ్చిన అభిజీత్ డిప్కే.. ఈ ఉద్యమాన్ని డిజిటల్ ప్రపంచం నుండి ప్రజా క్షేత్రం దిశగా నడిపించారు. విజయవంతంగా ఢిల్లీ రోడ్ల మీదికి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీ వివాదం చెలరేగుతున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద తొలి భారీ ప్రత్యక్ష నిరసన ప్రదర్శనను నిర్వహించారు.
ఈ క్షేత్రస్థాయి ఉద్యమం ఢిల్లీకే మాత్రమే పరిమితం కాలేదు. జూన్ రెండోవారం నాటికి పూణే, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అమృత్‌సర్ వంటి నగరాలకు కూడా వేగంగా విస్తరించింది. జూన్ 20 నాటికి ఢిల్లీలో జరిగిన రెండో భారీ ప్రదర్శనతో ఈ నిరసనల తీవ్రత మరింత పెరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాలు, వివిధ కీలక రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించి కలిసి నడిచాయి.
యువత సమస్యలు, నిరుద్యోగిత, విద్యా వ్యవస్థలోని అవకతవకలే ఎజెండాగా సాగిన ఈ ఉమ్మడి పోరాటం పాలకులకు సరికొత్త సవాలుగా మారింది. జూన్ 28న ఈ వివాదంలోకి లడఖ్‌కు చెందిన పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ అడుగుపెట్టడంతో ఈ నిరసనకు మరింత నైతిక బలం చేకూరింది. నిరుద్యోగ యువత డిమాండ్లకు మద్దతుగా ఆయన జంతర్ మంతర్ వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
మే 15- సుప్రీంకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలతో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి పునాది పడింది.
మే 16- కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. అభిజీత్ డిప్కే ఆధ్వర్యంలో ఆన్‌లైన్ పేజీ ప్రారంభమైంది.
జూన్ 6- తొలి ప్రత్యక్ష నిరసనకు బీజం పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ఆరంభం.
జూన్ 28- కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ప్రారంభించారు.
జూలై 20- వర్షాకాల సమావేశాల తొలిరోజున పార్లమెంట్ మార్చ్ ను చేపట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. వేలాదిమంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరింద.
జూలై 24- వాంగ్‌చుక్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో డిప్కే స్వయంగా నిరాహార దీక్షకు కూర్చున్నారు.
జూలై 25- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావ చరిత్ర గమనిస్తే, ఆధునిక కాలంలో సోషల్ మీడియా ఏ విధంగా బలమైన ఉద్యమాలకు ఊతమిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆన్‌లైన్‌లో వ్యంగ్యాస్త్రాల ద్వారా ప్రారంభమైన ఆ పార్టీ ప్రయాణం చివరకు దేశంలోని అత్యున్నత రాజకీయ నిర్ణాయక వ్యవస్థలనే నిలదీసే స్థాయికి చేరుకుంది. ఉపాధి కల్పన, పరీక్షల నాణ్యత వంటి యువత సమస్యలపై త్వరితగతిన స్పందించవలసిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications