BC Reservations: సీఎం చంద్రబాబు సీరియస్ స్టేట్‌మెంట్, గొడ్డలి పార్టీ కుట్రలంటూ..
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతం దాటకూడదన్న నిబంధన ఆధారంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, హైకోర్టు తీర్పుపై రేపే సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్టీఆర్ బీసీలకు రాజకీయంగా సముచిత గుర్తింపు తెచ్చారని, తాను 1995లో సీఎం అయ్యాక స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేశానని గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 'గొడ్డలి పార్టీ' ఆ రిజర్వేషన్లను ఏకంగా 24 శాతానికి తగ్గించిందని, దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీల స్థానిక పదవులు కోల్పోయారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే, ఆ పార్టీ నేతలు కోర్టుల్లో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు ఉద్ఘాటించారు. కేవలం రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా, మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక కోర్టుల్లో 350కి పైగా కేసులు వేసి నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై కక్షగట్టి, వారికి రావాల్సిన హక్కులను కాలరాసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ బీసీలకు రాజకీయంగా పూర్తి అండగా నిలిచే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకత్వం, ప్రజాప్రతినిధుల సేవలను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. రేపల్లే ప్రాంతంలో బీసీ బిడ్డగా అనగాని భగవంతరావు ఎంతో చక్కగా పనిచేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనగాని సత్యప్రసాద్ ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. బీసీలు కేవలం ఓటర్లుగానే కాకుండా నిజమైన నాయకులుగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలను కల్పిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చంద్రబాబు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
