G20 Summit 2023: జీ20లోనూ ఇండియాకు బదులు భారత్- ప్రధాని నేమ్ ప్లేట్ మార్చి..
ఇవాళ ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఇండియాకు బదులుగా భారత్ పేరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీ20 సదస్సులో పాల్గొనే అతిధులకు పంపిన ఆహ్వనంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరును ప్రస్తావించింది. ఇండియాకు బదులుగా భారత్ పేరు వాడారన్న వివాదం కూడా మొదలైంది కూడా ఇక్కడే. అయితే ఇవాళ ప్రధాని మోడీ ముందు ఇండియాకు బదులుగా భారత్ నేమ్ ప్లేట్ కనిపించడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

ఇవాళ ప్రారంభమైన జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "భారత్"కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా గుర్తింపు పొందారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వం అనేక అధికారిక జీ20 పత్రాలలో ఇండియాతో పాటు దేశానికి రాజ్యాంగంలో ఉపయోగించిన "భారత్" అనే పేరును ఉపయోగించింది. అధికారిక వర్గాలు ఇది చేతన నిర్ణయమని పేర్కొన్నాయి. ఈ సదస్సుకు వేదికైన భారత్ మండపంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ముందు ఉన్న నేమ్ కార్డ్ 'భారత్' అని రాసి ఉండటం విశేషం.
"భారత్ ప్రెసిడెంట్" పేరుతో ఇప్పటికే జీ20 ప్రతినిధులు, ఇతర అతిథులకు విందు ఆహ్వానం పంపిన కేంద్రం.. ఇవాళ జీ20 వేదిక వద్ద కూడా ఈ పేరు ఎక్కువగా కనిపించేలా పెట్టింది. ఇప్పటికే దేశం పేరు నుండి "ఇండియా"ను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్న వేళ కేంద్రం జీ20 సదస్సులో భారత్ పేరును విస్తృతంగా వాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
జీ20 సదస్సుతో పాటు బ్రిక్స్, ఆసియాన్ సదస్సుల్లోనూ ఇండియాకు బదులుగా భారత్ పేరు కేంద్రం వాడటంతో విదేశీ అధినేతలు కూడా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ పేరు మార్పుపై చర్చించుకుంటున్నారు. కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకుండా ఇలా ఇండియా పేరును భారత్ గా మార్చేసి వాడేస్తుండటంపై అంతర్గతంగా దేశంలోనూ విస్తృత చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications