ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్, కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: 119 మందికి పద్మ అవార్డులు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2021 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. కాగా, కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం మహావీర పురస్కారం ప్రకటించింది.

కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర
గత జూన్ నెలలో గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సంతోష్ బాబు సేవలను స్మరిస్తూ మరణాంతరం మహావీరచక్ర పురస్కారాన్ని ఆయనకు కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు.. 16 బీహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలోనే గల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు ధీటుగా తిప్పికొట్టారు. జూన్ 15న జరిగిన ఈ ఘటనలో సంతోష్ బాబుతోపాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు.

ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్
గాన గంధర్వుడు దిగవంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కళా రంగంలో పద్మవిభూషణ్‌తో కేంద్రం గౌరవించింది. ఈయనకు తమిళనాడు రాష్ట్రంలో నుంచి ఈ అవార్డు లభించడం గమనార్హం. కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే. ఆయన దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ పాటలు పాడటం గమనార్హం. ఆయనతోపాటు మరో ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.

షింజో అబేతోపాటు మరికొందరు పద్మవిభూషణ్‌లు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (పబ్లిక్ ఎఫైర్స్)
బెల్లె మోనప్ప హెగ్డే (మెడిసిన్-కర్ణాటక)
నరీందర్ సింగ్ కపానీ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్-అమెరికా)
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఇతరాలు-ఆధ్యాత్మికం-ఢిల్లీ)
బీబీ లాల్ (ఇతరాలు-ఆర్కియాలజీ-ఢిల్లీ)
సుదర్శన్ సాహో (కళారంగం-ఒడిశా)
10 మందికి పద్మభూషణ్
కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర (కళారంగం-కేరళ)
తరుణ్ గొగొయ్(పబ్లిక్ ఎఫైర్స్అస్సాం మాజీ ముఖ్యమంత్రి, మరణాంతరం అవార్డు)
చంద్రశేఖర్ కంబర (లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్-కర్ణాటక)
సుమిత్రా మహాజన్ (పబ్లిక్ ఎఫైర్స్-మధ్యప్రదేశ్)
నృపేంద్ర మిశ్రా (సివిల్ సర్వీస్-ఉత్తరప్రదేశ్)
రామ్ విలాస్ పాశ్వాన్ (పబ్లిక్ ఎఫైర్స్-బీహార్, మరణాంతరం అవార్డు)
కేశుభాయి పటేల్ (పబ్లిక్ ఎఫైర్స్-గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, (మరణాంతరం)
రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ-మహారాష్ట్ర)
తర్లోచన్ సింగ్ (పబ్లిక్ ఎఫైర్స్-హర్యానా).
ఇక 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరికి, ఏపీ నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.
కనకరాజు (కళారంగం-తెలంగాణ)
రామస్వామి అన్నవరపు (కళారంగం-ఆంధ్రప్రదేశ్)
ప్రకాశరావు ఆసవాది (లిటరేచర్-ఎడ్యుకేషన్-ఆంధ్రప్రదేశ్)
నిడుమోలు సుమతి (కళారంగం-ఆంధ్రప్రదేశ్)