హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షం, కొద్ది గంటల్లో - తాజా హెచ్చరిక..!!
మరోసారి భారీ వర్షం అలర్ట్స్ జారీ అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ మహానగరాన్ని నిన్న సాయంత్రం హఠాత్తుగా ముంచెత్తిన భారీ వర్షం నగరవాసులను చిగురుటాకులా వణికించింది. కేవలం గంటపాటు కురిసిన ఏకధాటి వానకే భాగ్యనగర రహదారులన్నీ చెరువులను, నదులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో మోకాళ్లోతు నీరు చేరడంతో నగరంలోని దాదాపు అన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఈ సాయంత్రం మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రుతువపనాల రాకతో ఒక్క సారిగా వర్షాలు మొదలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ లో కురిసిన వర్షంతో ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించింది. ఆఫీస్ వేళలు ముగిసి ఇళ్లకు బయలుదేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సాధారణ ప్రజలు రోడ్లపైనే గంటల తరబడి నరకయాతన అనుభవించారు. సాధారణంగా అరగంటలో చేరుకునే దూరానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ (GHMC) డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వల్లే ప్రతి చిన్న వానకూ నగరం మునిగిపోతోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లన్నీ తిరునాళ్లను, జాతరలను తలపించాయి. ప్లాట్‌ఫారమ్‌లు, క్యూ లైన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి, కనీసం అడుగు తీసి అడుగు వేయలేనంతగా జనం స్తంభించిపోయారు.

సాయంత్రానికి భారీ వర్షం
కాగా, ఈ రోజు మరోసారి భారీ వర్షం పైన హెచ్చరికలు జారీ అయ్యాయి. రాబోయే గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జంగావ్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ లో సాయంత్రానికి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications