సీజేపీ లీడర్స్ పై రూ. 2 కోట్ల దావా.. బీజేపీ నేత సంచలనం
ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి బిగ్ షాక్ తగిలింది. సీజేపీలోని కీలక నేతలైన అభిజిత్ దిప్కే, ఆశుతోష్, సౌరవ్ పై అధికార బీజేపీ పార్టీ రూ.2 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ మేరకు తనపై పోస్ట్ చేసిన ఫేక్ ఏఐ పోస్టులకు గానూ దిల్లీ హైకోర్టులో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. తనపై ఇప్పటికే నెట్టింట ప్రచారం అవుతున్న ఫేక్ కంటెంట్ ను తొలగించాలని.. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనపై సెప్టెంబర్ 10 గురువారం రోజున దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇటీవల అరెస్ట్ అయిన స్వతంత్ర భరద్వాజ్ పై గౌరవ్ భాటియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు ఏఐ పోస్టులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సీజేపీ ఈ పోస్టులను సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ లో పోస్టు చేయడంతో ఈ వివాదం మొదలైందని గౌరవ్ భాటియా దావాలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని భాటియా ఖండించారు. పోస్టును తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీజేపీ నేత సౌరవ్ దాస్ ను ఆయన డిమాండ్ చేశారు. అయితే సౌరవ్ దాస్ ఆ పోస్టును తొలగించి.. అది ఏఐ సాయంతో జనరేట్ చేసిన పోస్టు అని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అలా ఈ పోస్టును ఇతర సీజేపీ నేతలకు కూడా ఫార్వార్డ్ చేశారు. మరో సీజేపీ నేత అశుతోష్ రాంకా ఇదే పోస్టును తిరిగి రీ పోస్ట్ చేసినట్లు దావాలో గౌరవ్ భాటియా స్పష్టం చేశారు.

ఈ పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లోనే 1.32 లక్షలకు పైగా మంది చూశారని.. ఇలాంటి ఫేక్ ప్రచారాలు తన ప్రతిష్ఠ, వృత్తి పరమైన స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపించాయని భాటియా స్పష్టం చేశారు. ఈ మేరకు నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని అంతేకాక ఈ పోస్టులను వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని.. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు ప్రచురించకుండా ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ దావాపై దిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 10న విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications
