గౌతమి షూట్ ఔట్: రివాల్వర్ రూ. 2,500
బెంగళూరు: కర్ణాటకలోని కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ లో పీయుసీ విద్యార్థిని గౌతమి (18)ని హత్య కేసులో నిందితుడు అటెండర్ మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు.ఇతను పూటకో మాట చెబుతున్నాడని పోలీసులు అంటున్నారు. మహేష్ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
గురువారం రాత్రి నిందితుడు మహేష్, కాలేజ్ ట్రస్ట్ అధ్యక్షుడు సోమ్ సింగ్, కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్. ప్రశాంత్ లను కోరమంగలలోని న్యాయమూర్తి సంతోష్ కుమార్ ఇంటిలో హాజరు పరిచారు. రివాల్వర్ గురించి మహేష్ గంటకు ఒక మాట చెబుతున్నాడని విచారణ చెయ్యడానికి అతనిని కస్టడికి తీసుకుంటామని పోలీసులు న్యాయయమూర్తి ముందు మనవి చేశారు.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి మహేష్ ను ఈ నెల 10వ తేదీ వరకు విచారణ చెయ్యడానికి పోలీసుకు అవకాశం ఇచ్చారు. కాలేజ్ ట్రస్ట్ అధ్యక్షుడు సోమ్ సింగ్, కాలేజ్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు మహేష్ ను కస్టడిలోకి తీసుకున్నారు.

రివాల్వర్ @ రూ. 2,500.........!
రెండు సంవత్సరాల క్రితం బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ లో రూ. 2,500 ఇచ్చి రివాల్వర్ తీసుకున్నానని మహేష్ పోలీసులకు చెప్పాడు. ఆ రోజు పరిచయం అయిన వ్యక్తి తనకు వెంటనే నగదు కావాలని తనను పీడించాడని , తన దగ్గర ఉన్న రూ. 2,500 ఇచ్చి రివాల్వర్ తీసుకున్నానని మహేష్ అంటున్నాడని పోలీసులు చెప్పారు.
ఇతను శివమొగ్గ జిల్లాలోని అగుంబె (సోంత ఊరు)కి రెండు సంవత్సరాల క్రితం వెళ్లాడు. తరువాత ఊరికి వెళ్లనేలేదు. వారం క్రితం సెలవు పెట్టి ఊరికి వెళ్లి వచ్చాడు. బెంగళూరులోని బి. నారాయణపురలో నివాసం ఉంటున్న తన అక్క శైలజ ఇంటికి 8 నెలల క్రితం వెళ్లాడు. మళ్లి హత్య చేసిన తరువాత శైలజ ఇంటికి వెళ్లాడని పోలీసులు అన్నారు.
రివాల్వర్ తాను నివాసం ఉంటున్న కాలేజ్ గదిలో పెట్టానని ఒక సారి, అక్క ఇంటిలో పెట్టానని ఒక సారి, అగుంబెలోని ఇంటిలో బట్టలలో దాచి పెట్టానని ఒక సారి చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. మహేష్ రివాల్వర్ ఎక్కడ నుండి తీసుకు వచ్చాడనే విషయంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications