పెళ్లి ఇంట్లో పేలిన జనరేటర్, వధూవరులు సహా ఆరుగురు మృతి - ప్రెస్ రివ్యూ

పెళ్లింట్లో పేలిన జనరేటర్

మహారాష్ట్రలో పెళ్లి ఇంట్లో జనరేటర్ పేలడంతో వధూవరులు సహా ఆరుగురు చనిపోయినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

జనరేటర్‌ పేలిన ఘటనలో గదిని చుట్టేసిన పొగతో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ఎస్పీ అరవింద్‌ సాల్వే తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాపూర్‌ పట్టణ సమీపంలోని దుర్గాపూర్‌ గ్రామ నివాసి రమేష్‌ లష్కరే గుత్తేదారుగా పనిచేస్తున్నారు.

ఆయన కుమారుడు అజయ్‌ వివాహం పది రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాధురితో జరిగింది. రెండు రోజుల కిందట కోడలిని ఇంటికి తీసుకొచ్చారు.

ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పెళ్లి కోసమని గతంలో అద్దెకు తెచ్చుకున్న జనరేటర్‌ ఇంట్లో ఉండడంతో దానిని ఆన్‌ చేశారు.

భోజనాలు చేశాక అంతా నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో అది పేలిపోయింది. పేలుడుకు వెలువడిన పొగతో ఊపిరి ఆడక అసువులు బాశారు.

దీంతో వధూవరులు సహా వరుడి తోబుట్టువులు ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రిజిస్ట్రేషన్

తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగనున్నాయి. మూడు కేటగిరీల్లో 30నుంచి 40 శాతం వరకు భూముల విలువలు పెరుగుతాయి.

ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటే రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా 6% నుంచి 7.5 శాతానికి పెంచారు.

ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన మార్కెట్‌ విలువల పెంపు సిఫారసులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

కమిటీ చేసిన సిఫారసులన్నింటినీ దాదాపుగా కేబినెట్‌ ఓకే చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులపై స్వల్ప మార్పులు చేయగా, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులపై ఎక్కువ మొత్తంలో విలువలు పెంచింది.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు, కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగ ఖాళీలపై సుదీర్ఘంగా ఏడు గంటలపాటు చర్చించారు.

ప్రస్తుతం రిజిస్టర్‌ చేస్తున్న డాకుమెంట్లపై 6% రిజిస్ట్రేషన్‌ చార్జీల(4% స్టాంపు డ్యూటీ, 1.5% ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5% రిజిస్ట్రేషన్‌ చార్జీ)ను వసూలు చేస్తున్నారు. దీనిని 7.5 శాతానికి పెంచాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రుయా ఘటన

ఆక్సిజన్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రుయాలో కోవిడ్ బాధితులు మరణించారని చిత్తూరు జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారని సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ బాధితులు మరణించిన ఘటనపై చిత్తూరు కలెక్టర్‌ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు.

ఆక్సిజన్‌ సరఫరా చేసే కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే బాధితులు మరణించారని తన నివేదికలో పేర్కొన్నారు.

కాంట్రాక్టర్‌ తొలగింపునకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది బాలస్వామి వివరించారు.

అలాగే ఆక్సిజన్‌ పీడనం తగ్గినప్పుడు అప్రమత్తం చేసే అలారం పనిచేయలేదని తెలిపారు.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసినట్టు సాక్షి రాసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫోన్ పోతే రికవరీ చేస్తాం- హైదరాబాద్ పోలీసులు

ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీ చేసి ఇస్తామని హైదరాబాద్ పోలీసులు భరోసా ఇచ్చినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఐఎంఈఐ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలతో సంప్రదిస్తే ఫోన్‌ వెతికి ఇస్తామని చెప్తున్నారు.

పోగొట్టుకొన్న 66 మంది సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఐఎంఈఐ నంబర్‌తో ఫోన్‌ ట్రాక్‌ చేసి యజమానులకు అందించారు.

పోగొట్టుకొన్న చోరీకి గురైన ఫోన్ల ఆచూకీ కనుగొనేందుకు నగర పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

హాక్‌-ఐ యాప్‌, మీసేవలోనూ లాస్ట్‌ ఫోన్‌ ఆప్షన్‌ ఎంచుకొని వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచించారు.

మీ సెల్‌ ఫోన్‌ పోతే, ఇలా చేయండి:

ఆండ్రాయిడ్‌ యూజర్లు అయితే గూగుల్‌కు వెళ్లి ఫైండ్‌ మై ఫోన్‌ అని టైప్‌ చేయాలి. మీ ఫోన్‌లో లాగిన్‌ అయిన జీమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంటర్‌చేస్తే మీ ఫోన్‌ లొకేషన్‌ను చూపిస్తుంది.

అందులో ఉన్న ఆప్షన్స్‌ను అనుసరిస్తే ఫోన్‌ దొరుకుతుంది.

ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టినా ఐదు నిమిషాల పాటు ఫోన్‌ రింగ్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

మీ ఫోన్‌ ఇతరుల చేతులకు వెళ్లిందనే అనుమానం ఉంటే ఎరేజ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని కంటెంట్‌ అంతా తొలగించుకోవచ్చు. స్క్రీన్‌ లాక్‌ కూడా వేసుకోవచ్చు.

ఐఫోన్‌ ఉన్న వారు గూగుల్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి ఫైండ్‌ మై ఫోన్‌ అని సెర్చ్‌ చేస్తే వారికి ఐక్లౌడ్‌ వస్తుంది. అందులో యాపిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఇతర వివరాలు నమోదు చేస్తే ఫోన్‌ లొకేషన్‌ కనిపిస్తుంది.

అని పోలీసులు చెప్పారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+