వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీ: పోటాపోటీ ఎన్నికల్లో వెనకబడ్డ ఏంగెలా మెర్కెల్ వారసుడు..సెంటర్-లెఫ్ట్‌కు పెరిగిన ఆధిక్యం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎస్‌పీడీ లీడర్ ఓలాఫ్ షోల్జ్

జర్మనీలో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఏంగెలా మెర్కెల్ వారసుడు ఆర్మిన్ లాషెట్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. కన్జర్వేటివ్స్ కంటే సెంటర్-లెఫ్ట్‌ కాస్త ఆధిక్యంలో ఉంది.

ఒపీనియన్ పోల్స్ ఫలితాల కన్నా ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉన్నాయి.

కన్జర్వేటివ్స్ పార్టీ.. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ)కు ఇంత తక్కువ ఓట్లు ఎప్పుడూ రాలేదు.

అయినప్పటికీ, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆర్మిన్ లాషెట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఓటింగ్ ముగిసినప్పటికీ, ఫలితాలు ఇంకా తేలలేదు. సీడీయూపై సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ) స్వల్ప ఆధిక్యంతోనే ఉన్నప్పటికీ, ఎస్‌పీడీ విజయానికి దగ్గరగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎస్‌పీడీ లీడర్ ఓలాఫ్ షోల్జ్ కూడా ప్రభుత్వం ఏర్పరచగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓట్ల ఆధిక్యం కనిపించగానే ఆయన అనుచరులు అభినందనలు తెలిపారు.

"జర్మనీకి మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం" ఏర్పాటు చేసే బాధ్యతను ఓటర్లు తమకు ఇచ్చారని షోల్జ్ టెలివిజన్ ప్రేక్షకులతో అన్నారు.

అయితే, ఎన్నికల ఫలితాలు చివరి ఫలితాలు కాబోవని, సంకీర్ణ కూటమి ఎవరు ఏర్పరుస్తారో వారిదే ప్రభుత్వమని ఆర్మిన్ లాషెట్ పేర్కొన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌లో గట్టి పోటీ కనిపించలేదుగానీ ఆదివారం జరిగిన ఎన్నికలు మొదటి నుంచీ అంచనాలను తారుమారు చేశాయి.

అయితే, సంకీర్ణ కూటమి ఏర్పడేవరకు ఏంగెలా మెర్కెల్ ఛాన్స్‌లర్‌గా కొనసాగుతారు.

ఎవరు ఛాన్సలర్‌గా ఎన్నికైనప్పటికీ, రాబోయే నాలుగేళ్లపాటు బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాన్ని ముందుకు నడిపిస్తూ వాతావరణ మార్పులు సమస్యపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఏర్పరచాలంటే కన్జర్వేటివ్స్ పార్టీకి, సెంటర్-లెఫ్ట్‌కు కూడా లిబరల్స్, గ్రీన్స్ పార్టీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీలకూ ఈ ఎన్నికల్లో అనుకున్నన్ని ఓట్లు దక్కలేదు.

ఈ నాలుగు పార్టీలు తప్ప మిగతా పార్టీలు చెప్పుకోగదగ్గ ఓట్ల శాతాన్ని సాధించలేకపోయాయి.

జర్మనీ ఒక కొత్త రాజకీయ శకంలోకి ప్రవేశించింది. మూడు పార్టీల సంకీర్ణ కూటమి ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడం ఆ దేశానికి ఇదే మొదటిసారి.

ఏంగెలా మెర్కల్‌తో సీడీయూ నాయకుడు ఆర్మిన్ లాస్చెట్

జర్మనీ ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఓట్లు ఎవరికి వేస్తారు?

సెప్టెంబర్ 26న జరిగిన ఎన్నికల్లో జర్మనీ ఓటర్లు పార్లమెంట్ దిగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ దిగువ సభను బుండెస్టాగ్‌ అని పిలుస్తారు. దాదాపు 6 కోట్ల మంది జర్మన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బుండెస్టాగ్‌లో కనీసం 598 సీట్లు ఉంటాయి. సాధారణంగా ఇంకా ఎక్కువే ఉంటాయి.

గెలిచిన పార్టీ మరో రెండు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి, పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వస్తుంది.

అంటే మెర్కెల్ తర్వాత జర్మనీ చాన్స్‌లర్ ఎవరన్నది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు.

జర్మనీ ఎన్నికల గ్రాఫిక్స్

చాన్స్‌లర్‌ను ఎలా ఎన్నుకుంటారు?

సంకీర్ణ కూటమిలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ చాన్స్‌లర్‌ను ఎంపిక చేస్తుంది. కానీ సంకీర్ణ కూటమి ఏర్పాటుకు సమయం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలు, మంత్రి పదవులపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది.

సంకీర్ణ కూటమిలోని పార్టీలు ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యులు ఓటింగ్‌ నిర్వహించి, చాన్స్‌లర్‌ను ఆమోదిస్తారు.

ఏ పార్టీలు రేసులో ఉన్నాయి?

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడానికి, చాన్స్‌లర్‌ను ఎన్నుకోవడానికి అవసరమైనన్ని సీట్లను మూడు ప్రధాన పార్టీలు గెలుచుకుంటాయని తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌ చెప్పాయి.

క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్

మెర్కెల్‌కు చెందిన కన్జర్వేటివ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్-సీడీయూ తన సిస్టర్ పార్టీ క్రిస్టియన్ సోషల్ యూనియన్‌తో కలిసి జర్మనీలో గత కొన్ని దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది.

మెర్కెల్ తన వారసుడిగా సీడీయూ నాయకుడు ఆర్మిన్ లాషెట్ వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఆయన ఓటర్లను ఆకర్శించడంలో విఫలమయ్యారు. దానికి కారణం జులైలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన నవ్వుతూ కనిపించారు.

బవేరియన్ నాయకుడు మార్కుస్ సోడెర్‌కు మంచి జనాదరణ ఉంది. కానీ ఆయన కన్జర్వేటివ్ ప్రత్యర్థి.. చాన్స్‌లర్ అభ్యర్థిగా ఆయన్ను ఒప్పుకోకపోవచ్చు.

వరద బాధిత పట్టణంలో పర్యటన సందర్భంగా నవ్వుతూ కనిపించిన సీడీయూ నాయకుడు ఆర్మిన్ లాస్చెట్‌

సోషల్ డెమోక్రటిక్ పార్టీ

సెంటర్-లెఫ్ట్‌ ఎస్‌పీడీ.. కన్జర్వేటివ్‌లతో కలిసి సంకీర్ణ కూటమిలో ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో వాళ్ల కంటే కాస్త ముందంజలో కనిపిస్తోంది.

ఆ పార్టీ నుంచి జర్మనీ ఆర్థికమంత్రి ఓలాఫ్ షోల్జ్ చాన్స్‌లర్ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఓపీనియన్ పోల్స్‌లో ఒలాఫ్ స్కోల్జ్ పార్టీ మూడోస్థానంలో ఉంది.

గ్రీన్స్

వాతావరణ మార్పులు, సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా లెఫ్ట్ వింగ్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పార్టీ ముందంజలో ఉంది.

గ్రీన్స్ నాయకురాలు అన్నలెనా బేర్‌బాక్‌కు ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేదు. కానీ ఆమె తన పార్టీని సంకీర్ణ కూటమిలో చేరే దిశగా నడిపించొచ్చు.

కూటములు పార్టీల రంగులను బట్టి తెలుస్తాయి. సెంటర్ లెఫ్ట్ (రెడ్) గెలిస్తే రెడ్-రెడ్-గ్రీన్ కూటమి, సీడీయూ(బ్లాక్) గెలిస్తే కెన్యా, జమైకా కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతుంటారు.

సంకీర్ణ ప్రభుత్వంలో కనిపించే ఇతర పార్టీలు అంటే లిబరల్ ఫ్రీ డెమోక్రాట్స్ (యెల్లో), సోషలిస్ట్ డై లింకే (లెఫ్ట్), ఫార్ రైట్ ఆల్టర్‌నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ)లకు జర్మనీలోని తూర్పు ప్రాంతాల్లో మంచి బలం ఉంది. కానీ రాజకీయాల కారణంగా ప్రధాన పార్టీలు వీటిని పెద్దగా పట్టించుకోవు.

గ్రీన్స్ నాయకురాలు అన్నలెనా బేర్‌బాక్‌

విజేతను ఎలా నిర్ణయిస్తారు?

జర్మనీ ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి స్థానిక ఎంపీని ఎన్నుకునేందుకు వేసే నియోజకవర్గ ఓటు. జర్మనీలో 299 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ప్రతి 2, 50, 000 మంది ఓటర్లకు ఒక ఎంపీ ఉంటారు. ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు గెలుచుకున్న అభ్యర్థి ఆ స్థానంలో విజయం సాధిస్తారు.

ఇక రెండో ఓటు దామాషా ప్రాతినిధ్యం పద్ధతిలో ఉంటుంది. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడ్డాయన్న దాన్నిబట్టి మిగిలిన 299 సీట్లను కేటాయిస్తారు. అవి ప్రతిపార్టీ రూపొందించిన ర్యాంక్ జాబితాలోని అభ్యర్థులకు కేటాయిస్తారు.

రెండో ఓటు ఎందుకంత కీలకం?

బుండెస్టాగ్‌లో అడుగుపెట్టాలంటే ప్రతిపార్టీ రెండవ ఓట్లలో కనీసం ఐదు శాతం గెల్చుకోవాలి. రాడికల్, చిన్న పార్టీలు అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఈ నిబంధన పెట్టారు.

జర్మనీ మిశ్రమ ఎన్నికల విధానం ప్రకారం రెండవ ఓటు ఫలితం పార్లమెంట్‌లో స్పష్టంగా కనిపించాలి. బుండెస్టాగ్‌లో ప్రతి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వంటి అంశాలను ఈ రెండవ ఓటు ప్రభావితం చేస్తుంది.

ప్రస్తుత బుండెస్టాగ్‌లో 709 స్థానాలు ఉన్నాయి.

బుండెస్టాగ్‌లో సీట్ల సంఖ్య ఎందుకు మారుతుంది?

ఇది అత్యంత క్లిష్టమైన భాగం. రెండు ఓట్లలో ప్రతిపార్టీ సాధించిన ఫలితాల మధ్య అసమతుల్యత ఉంటే పార్లమెంట్‌ స్థానాలు పెరుగుతాయి. అంటే పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత బుండెస్టాగ్‌లో 598 సీట్లు లేవు. ఇందులో 709 స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య ఇప్పుడు 800 వరకు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం.

సీడీయూ.. 110 నియోజక వర్గాల్లో విజయం సాధించి, పార్టీ ఓట్లతో 100 సీట్లు గెల్చుకుందని అనుకుందాం. ఇలాంటి సమయంలో సీడీయూకు రావాల్సిన సీట్లకంటే 10 సీట్లు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం రెండవ ఓటులో ఆ పార్టీకి వచ్చిన వాటా అది.

కొన్నిసార్లు ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసి, సెకండ్ ఓటును మరో పార్టీకి వేయొచ్చు.

అంటే సీడీయూకు అదనంగా పది సీట్లు వస్తాయి. దీన్ని 'ఓవర్‌హాంగ్ మాండేట్స్' అని పిలుస్తుంటారు.

అయితే, సీడీయూకు రావాల్సిన సీట్ల కంటే పది స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ పార్టీకి ఇది అదనపు ప్రయోజనం. కానీ ఇది సరికాదు. అందుకే సమతూకం సాధించేందుకు మిగతా పార్టీలకు కూడా సీట్లు కేటాయిస్తారు. దీన్నే 'సీట్ల బ్యాలెన్సింగ్' అని పిలుస్తారు.

ఇలా చేయడం వల్ల మిగతా పార్టీల సభ్యులు కూడా పెరుగుతారు. ఆ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా ఈ స్థానాలను కేటాయిస్తారు.

ఈ ఉదాహరణలో అసమతుల్యతను సరిచేసేందుకు ఎన్నికల ఫలితాల కంటే మరో 10 శాతం సీట్లు పెరుగుతాయి.

ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి?

ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఏ పార్టీ గెలిచిందో స్పష్టంగా తెలిసిపోతుంది.

2017లో బుండెస్టాగ్‌ ఎన్నికల్లో ఇలాగే జరిగింది. అప్పుడు మెర్కెల్ పార్టీకి నిరాశజనక ఫలితాలు వచ్చాయి.

కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని వారాలు పట్టొచ్చు. దీని కోసం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుంది.

2017లో ఇలాగే జరిగింది. సీడీయూ(బ్లాక్), గ్రీన్, ఎఫ్‌డీపీ(యెల్లో)లతో కలిసి జమైకా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ అది విఫలమైంది. దాంతో ఏకాభిప్రాయ సాధనకు వారాల తరబడి చర్చలు కొనసాగాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Germany: Angela Merkel's party loses election: Rise to center-left
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X