తుపాకులను వదిలేయండి: నక్సల్స్‌కు మోడీ పిలుపు
బ్రహ్మపురి(మహారాష్ట్ర): హింసామార్గాన్ని విడిచిపెట్టాలని తీవ్రవాద పంథాలో సాగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. భుజాలపై తుపాకులను మోస్తున్న ఈ యువత వాటిని వదిలేసి తమ జీవితాలను మార్చుకోవడానికి వాటి స్థానంలో నాగళ్లను పెట్టుకోవాలని ఆయన కోరారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా గల చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురిలో శుక్రవారం బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
‘ఉగ్రవాదం ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. ఉగ్రవాదాన్ని వీడాల్సిందిగా హింసామార్గం పట్టిన యువతను నేను కోరుతున్నాను. ఉగ్రవాదం మీకు మంచి చేయదు' అని ఆయన యువతను ఉద్దేశించి అన్నారు. చంద్రాపూర్ జిల్లాలో 1985 ఫిబ్రవరి నుంచి 2014 జూలై మధ్య కాలంలో మావోయిస్టుల హింసకు తొమ్మిది మంది బలయ్యారని మహారాష్ట్ర పోలీసు శాఖలోని నక్సలైట్ల వ్యతిరేక విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టుల సాయుధ పోరాట పంథాను అనుసరిస్తున్న యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి మోడీ ప్రయత్నించారు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్‌లో వలె ఇక్కడ కూడా రైతులు ధనికులుగా మారాలంటే మహారాష్టల్రో ఈ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు.

‘సాగునీరు లేక ఇక్కడ రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి సౌకర్యం లభించి వారి పంట భూములు సస్యశ్యామలం కావాలంటే మీరు బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించడం తప్పనిసరి' అని మోడీ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
తగినంత నీటిపారుదల సదుపాయం ఉంటే తన పొలంలో బంగారం పండించేంత శక్తి రైతుకు ఉందని ఆయన పేర్కొన్నారు. బీమారు రాష్ట్రంగా పేరుపొందిన చత్తీస్‌గఢ్ ఇప్పుడు బిజెపి పాలనలో ఎంతో సంపన్నమయిన రాష్ట్రంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వస్తేనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమరావతి జిల్లా దామన్‌గాంవ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఇటీవల విదర్భ ప్రాంతంలో పత్తి, నారింజ రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన అంశాన్ని ప్రస్తావించారు. ‘మన రైతులు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన నారింజ పండ్లను పండిస్తున్నారు. అయితే వారు ఆ పళ్ల రసాలకు బదులు విషం తాగుతున్నారు' అని మోడీ అన్నారు. ఈ పరిస్థితి మారాలని చెప్పారు.












Click it and Unblock the Notifications