చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం, హత్య: పొరుగింటి వ్యక్తే
రాయచూర్: అభం శుభం తెలియని చిన్నారి పాలిట పొరిగింటివాడే కాలయముడయ్యాడు. అమాయకంగా ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి, ఇంట్లోకి తీసుకెళ్లాడు. తర్వాత అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశాడు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని రాయచూరులో శనివారం సంచలనం సృష్టించింది.
స్థానికి ఎస్పీ కార్యాయం సమీపంలోని పోలీసు కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర సింగ్(30) అనే వ్యక్తి కొంత కాలంగా పోలీస్ కాలనీలో పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అతడికి ఆ క్వార్టర్స్‌లోని 201 ఇంటిని కేటాయించారు.
ఆ ఇంటి పక్కనే ఉంటున్న 9ఏళ్ల తమన్నా ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఆ చిన్నారిని చాక్లెట్ ఇస్తానంటూ ఆశ చూపించి రాజేంద్రసింగ్ తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశాడు.
తర్వాత అక్కడే గొయ్యితీసి పూడ్చిపెట్టాడు. పాప కోసం వెతకడం ప్రారంభించిన తల్లిదండ్రులు, ఈ విషయమై సదర్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వెతుకుతున్న వారికి నిందితుడి ఇంటి ఎదుట బాలిక చెప్పులు కనిపించాయి. దీంతో రాజేంద్రసింగ్‌ను నిలదీయగా చేసిన దారుణాన్ని ఒప్పుకున్నాడు. గుంతలో పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

విద్యార్థినుల అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ
భరత్‌నగర్ నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల కేసులో మిస్టరీ వీడింది. వాళ్లు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. భరత్‌నగర్‌లోని ఎంఐజీకి తన్మయి(11) మూసాపేటలోని సర్దార్ పటేల్‌నగర్‌కు చెందిన శోభ (13) భరత్‌నగర్‌లోని స్ర్పింగ్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నారు. సరిగా చదవడంలేదంటూ తన్మయిని తల్లిదండ్రులు గురువారం మందలించారు. తన్మయి, శోభ కలసి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో శోభ ఇంటికెళ్లారు.
అక్కడ తల్లిదండ్రులు తనను మందలించిన విషయం శోభకు చెప్పింది. దాంతో ఇద్దరూ కలసి ముంబయి, గోవా, ఉత్తరప్రదేశ్ వెళ్లాలని అనుకున్నారు. నేరుగా భరత్‌నగర్‌లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కి లింగంపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎలా వెళ్లాలో వారికి తెలియలేదు. దాంతో షాద్‌నగర్‌కు వెళ్లడానికి బస్సు ఎక్కారు. షాద్‌నగర్‌లో బస్సు దిగారు. బంధువుల సహాయంతో షాద్‌నగర్‌లోని కొత్తపేట ప్రాంతంలోని శోభ వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నారు.
శోభ వాళ్ల అమ్మమ్మ ఎందుకొచ్చారని పిల్లలను ఆరా తీయడంతో సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. శోభ మేనమామ నర్సింహ శనివారం ఉదయం 8 గంటల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కొడిత్యాలలో ఉంటున్న మరో సోదరి మణెమ్మ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి వాళ్ల తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశారు. ఇద్దరిని బుజ్జగించి మణెమ్మ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. పిల్లల్నితల్లిదండ్రులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications