India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి వరద: మునిగిపోయిన ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ టెంట్లు వేసుకుని కొండలపైనే ఎందుకు గడుపుతున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గోదావరి వరదలు

చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జులైలోనే విరుచుకుపడిన గోదావరి తాకిడికి ఈ నదీ తీరంలోని వందల గ్రామాలు వణికిపోయాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఆ వరద తాకిడి తగ్గి రెండు వారాలు గడిచాయి.

కానీ వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల అవస్థలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలు కోలుకుంటున్న దాఖలాలు లేవు. నేటికీ వందల కుటుంబాలు కుటుంబాలు కొండలు, గుట్టలపైనే తలదాచుకుంటున్నారు.

సొంత ఇళ్లన్నీ బురదతో నిండిపోవడంతో సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి కష్టపడుతూనే తాత్కాలిక శిబిరాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు.

వరద బాధితులందరినీ ఆదుకుంటామని జులై 27న చింతూరు ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం వరద సహాయం అందించడంలో విఫలమయ్యిందని ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూనవరం పరిసరాల్లో పర్యటించిన సమయంలో విమర్శించారు.

అధికార, విపక్ష నేతల మాటలు ఎలా ఉన్నప్పటికీ వరద బాధితుల పరిస్థితి తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.

గోదావరి వరదలు

అత్యధిక నష్టం ఇప్పుడే..

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న కూనవరం, వీఆర్ పురం, ఎటపాక, చింతూరు, దేవీపట్నం మండలాలతో పాటుగా ఏలూరు జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుకునూరు, పోలవరం మండలాల్లోని సుమారు 120 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.

చాలా గ్రామాల్లో ఈ సారి రెండో అంతస్తు వరకూ వరద నీరు ప్రవహించింది. 1986 వరదల తర్వాత అత్యధికంగా ఈ సారి వరద తాకిడిని ఆ ప్రాంత వాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటితో పోలిస్తే అత్యధిక నష్టం కూడా చవిచూసినట్టు వారు చెబుతున్నారు.

గోదావరి వరదలు

"అప్పట్లో వరదలు వచ్చినా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండేవారు. కానీ ఈ సారి తగిన సమాచారం లేదు. ఇంత ఉధృతంగా వరద ఉంటుందనే విషయాన్ని అధికారులెవరూ చెప్పలేదు. పైగా అన్ని ఇళ్లల్లో సామాన్లు బాగా పెరిగాయి. అప్పట్లో వంట సామాన్లు, బట్టలు, ఇంకొందరికి మంచాలు వంటివి మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపుగా చాలామందికి టీవీలు, ఫ్రిజ్‌లు, మోటార్ వాహనాలు, ఇతర సామాగ్రి ఉన్నాయి. వాటిని ఒడ్డుకు చేర్చుకునేలోగా వరదలు వచ్చేశాయి. కొందరు రెండో అంతస్తులోకి తీసుకెళ్లినా అక్కడికి కూడా వరద నీరు వచ్చేసింది. దాంతో అపార నష్టాన్ని మిగిల్చింది. చాలామంది జీవితాలు ఐదు, పదేళ్ల వెనక్కి వెళ్లిపోయాయి. ఇళ్లు కూలిపోవడం వంటి వాటికి ప్రభుత్వం సహాయం అందుతుందేమో గానీ, వరదల్లో నష్టపోయిన ఇంటి సామగ్రి మళ్లీ సమకూర్చుకోవాలంటే తలకుమించిన భారమే"అని వీఆర్ పురం గ్రామానికి చెందిన ఎం కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.

గడిచిన రెండు దశాబ్దాలుగా ఎన్నడూ ఇలాంటి వరద తీవ్రత చూడని స్థానికులు తగిన అప్రమత్తతో వ్యవహరించకపోవడం కూడా ఎక్కువ నష్టానికి కారణమయ్యిందని ఆయన బీబీసీతో అన్నారు.

గోదావరి వరదలు

ఇళ్లల్లోకి ఎప్పుడు వెళతామో చెప్పలేం..

కూనవరం, రేఖపల్లి సహా వివిధ మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో సైతం నివాసాలు మళ్లీ సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి జనం ప్రయత్నిస్తున్న దృశ్యాలు బీబీసీకి కనిపించాయి. ఎంపీడీవో ఆఫీసు, బ్యాంకులు వంటి వాటిని తిరిగి కార్యకలాపాలకు సిద్ధం చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.

ఇక స్కూళ్లయితే తిరిగి ప్రారంభం కావాలంటే మరో పక్షం రోజులు కనీస సమయం పట్టేలా ఉంది. కూనవరం జెడ్పీ హైస్కూల్‌ను 20 రోజుల వరకూ తెరవలేమని ప్రధానోపాధ్యాయుడు బీబీసీకి తెలిపారు. ఇప్పటికే ఆ స్కూల్ మూతపడి 20 రోజులు దాటింది. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ పరిస్థితి అలా ఉందంటే ఇక మారుమూల ప్రాథమిక పాఠశాలలు తిరిగి సిద్ధం కావాలంటే ఎంత సమయం పడుతుందో ఊహించుకోవచ్చు.

"మా ఇంటి నిండా బుదర ఉంది. వరద వస్తోందని జులై15 నాడు దగ్గరలో ఉన్న కొండ ఎక్కేశాము. మా తర్వాత చాలామంది వచ్చారు. అక్కడ టెంట్లు వేసుకున్నాం. 16వ తేదీన పోలీసులు వచ్చి వరద పెరుగుతుంది, ఇంకా పైకి వెళ్లిపోండి అన్నారు. తీరా కొండపైకి వెళ్లిపోతే, వర్షం వచ్చింది. అయినా అలా వానలో తడుస్తూనే గడిపేశాం. తీరా వరద తగ్గిన తర్వాత 15 రోజులుగా కష్టపడుతున్నా ఇల్లు శుభ్రం కాలేదు. ఇంకెంత ప్రయత్నం చేయాలో అర్థం కావడం లేదు. ఇద్దరు కూలీలను కూడా పెట్టి రూ. 10వేలు ఖర్చు చేసినా ఇల్లు మా నివాసానికి అనుకూలంగా రాలేదు. మా ఇంట్లో మేము అడుగుపెట్టాలంటే ఇంకా ఎంత కాలం పడుతుందో అర్థం కావడం లేదు"అని కూనవరం గ్రామానికి చెందిన పి రామలక్ష్మి చెప్పారు.

ఇంట్లో పేరుకుపోయిన బుదర కడగాలి...మిగిలిన సామాన్లు శుభ్రం చేసుకోవాలనుకుంటున్నా కరెంటు లేక నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆమె బీబీసీతో అన్నారు.

గోదావరి వరదలు

కొండపైనే ఉంటున్నాం..

కూనవరం, వీఆర్ పురం మండలమంతా ఇంకా కరెంటు కూడా పునరుద్ధరించలేదు. వందల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. వాటిని సరిచేసేందుకు కనీసంగా మరో వారం రోజులు పడుతుందని ట్రాన్స్ కో చింతూరు ఏఈ తెలిపారు.

వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో కూడా అత్యధిక గ్రామాల్లో కరెంటు సరఫరా జరగడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

కరెంటు లేకపోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి ఎంత శ్రమిస్తున్నా కొలిక్కి రాకపోవడంతో చాలామంది ఇంకా కొండల మీదనే నివాసాలు ఉంటున్నారు. వందల కుటుంబాలు ఇంకా టెంట్లు వేసుకుని, పిల్లా పాపలతో అక్కడే గడుపుతున్నారు.

"ఎత్తైన ప్రదేశం అని ఇక్కడికొచ్చి 20 రోజులు దాటుతోంది. పాములు, పుట్టలు మధ్యనే గడిపాము. వరదల్లో తెల్లవార్లు నిద్రపోకూండా ఏ మూల నుంచి ఏ విష జంతువు వస్తుందోననే బెంగతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇప్పటికీ ఇళ్లు పడిపోయిన వాళ్లు, వాటిని కడుగుకోవడానికి అవకాశం లేనివాళ్లమంతా ఇలా కొండల మీదనే ఉంటున్నాం. ఇంకా కొందరు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. మాకు ప్రభుత్వం 25 కిలోల బియ్యం, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, ఆయిల్ ప్యాకెట్‌తో పాటుగా రూ. 2వేలు కూడా ఇచ్చారు. కానీ మా వీధులు, ఇళ్లు శుభ్రమయ్యేలా చేసి ఉంటే బాగుండేది"అని కూనవరం గ్రామానికి చెందిన పొడియం సూరమ్మ అన్నారు.

ఇళ్లు, వీధులు అన్నీ బురదగానే ఉన్నాయని, మళ్లీ వరదలు వస్తే ఏమవుతుందోననే బెంగతో కొండల మీదే గడుపుతున్నామని ఆమె బీబీసీతో అన్నారు.

గోదావరి వరదలు

పోలవరం ప్రాజెక్టు వల్లనే..

వరద బాధితులందరినీ ఆదుకునే బాధ్యత తమదేనని సీఎం జగన్ ప్రకటించారు. వరద బాధితులతో మాట్లాడిన సమయంలో చింతూరు మండలంలో ఆయన పోలవరం ముంపు మండలాల ప్రజలందరిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకావడం లేదని వేలేరుపాడు గ్రామానికి చెందిన కారం చిన్నయ్యదొర అన్నారు.

"మేమంతా పోలవరం నిర్వాసితులం. మాకు ప్యాకేజీ ఇచ్చేస్తే ఈ ఇళ్లన్నీ ఖాళీ చేసేస్తాం. ఏటా వరదలు వచ్చి ముంచేస్తుంటే ఎన్నాళ్లని బాధపడతాం. మా దారిన మేం పోతామని చెబుతున్నాం. కానీ ప్రభుత్వం మాకు రావాల్సిన ప్యాకేజీ ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం కాఫర్ డ్యామ్ వల్ల చిన్న వరదలకే మా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వరదలకు పోలవరం కాఫర్ డ్యామ్, స్పిల్ వే లేకపోతే మాకు ఇంత నష్టం ఉండేది కాదు. వాటివల్లనే నష్టపోతున్నాం. మేం పోతామని చెబుతుంటే ప్రభుత్వం గడువులు పెడుతోంది కానీ ఫలితం ఉండడం లేదు"అని ఆయన వాపోయారు.

పునరావాస కాలనీలు సిద్ధం చేసి, పరిహారపు ప్యాకేజీ చెల్లిస్తే ఇళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వరదలు మళ్లీ వచ్చినా తమకు సమస్య ఉండదని, తాము తరలిపోయేందుకు ప్రభుత్వం చట్ట ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఇవ్వాలని ఆయన కోరారు.

''వరద సాయం ఇవ్వరు.. పునరావాసం కల్పించరు''

పోలవరం ముంపు మండలాల ప్రజల సమస్యలకు కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు అన్నారు.

"అత్యంత తీవ్రంగా వరదలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం తక్షణ సహాయం కింద రెండు వేలు చేతులు పెట్టి చేతులు దులుపుకుంది. ఏజెన్సీలో 25 రోజులుగా కరెంటు లేదు. వరదలు తగ్గి 15 రోజులవుతోంది. ఇంతకాలం పాటు విద్యుత్ ఇవ్వకపోతే ఎక్కడయినా ఊరుకుంటారా? పోలవరం ముంపు గ్రామాలంటే నిర్లక్ష్యం. గిరిజనుల పట్ల అశ్రద్ధ. గిరిజన ప్రాంతంలో అపార నష్టం జరిగినా ఇప్పటి వరకూ వరద సహాయం ఏమీ ప్రకటించలేదు. ఏటా ఇలా వరదల బారిన పడకుండా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్‌అండ్‌ఆర్ చెల్లించడం లేదు. ఏదీ చేయకపోతే గిరిజనలు ఎలా బతకాలి? ఊళ్లో ఉంటే మునిగిపోతున్నారు.. ఒడ్డుకి పోదామంటే ప్రభుత్వం తాను చేయాల్సింది చేయడం లేదు. ఇదేం న్యాయం"అని ఆయన ప్రశ్నించారు.

వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు రూ. 20వేలు చొప్పున సహాయం అందించాలని, పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

8 వారాల్లో సహాయం అందిస్తాం..

వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ సహాయం పంపిణీ పూర్తిగా అందించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నష్టం అంచనాలు వేసేందుకు రెండు వారాల సమయం పడుతుందని జులై 27న ఆయన ప్రకటించారు. రెండు వారాల్లో వరద నష్టం అంచనాలు వేసి, బహిరంగంగా బాధితుల జాబితా వెల్లడిస్తామని సీఎం తెలిపారు.

"మనకు యంత్రాంగం ఉంది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతీ 50 కుటుంబాలకు వాలంటీర్ వచ్చారు. వారి ద్వారా నష్టం అంచనాలు వేయిస్తాం. రెండు వారాల్లో నష్టపోయిన వారందరికి సంబంధించిన వివరాలు బహిరంగంగా ప్రకటిస్తాం. మరో రెండు వారాల గడువు ఇచ్చి ఎవరైనా బాధితుల పేర్లు లేకపోతే జోడిస్తాం. ఆ తర్వాత రెండు వారాల్లో నష్టపరిహారం నిధులు విడుదల చేస్తాం. 8 వారాల గడువుతో బాధితులందరికీ సహాయం అందుతుంది. నష్టపోయిన మేరకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తాం. ఇల్లు కోల్పోయిన, పంట నష్టపోయిన అందరికీ సహాయం అందుతుంది"అని సీఎం హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్ల మేరకు ముంపు బారినపడే వారందరికీ సెప్టెంబరులోగా ఆర్‌అండ్‌ఆర్ అమలు చేస్తామని సీఎం తెలిపారు. పునరావాస కాలనీలు కూడా అప్పటికి సిద్ధం అవుతాయని అన్నారు.

సీఎం ప్రకటించిన వరద సహాయం గడువు రెండు వారాలు దాటుతున్నా ఇంకా తమ వద్దకు నష్టం అంచనా వేసేందుకు అధికారులు ఎవరూ రాలేదని కూనవరం గ్రామానికి చెందిన బేగం అనే బాధితురాలతో పాటు అనేక మంది చెప్పారు. వారంతా ప్రస్తుతం కూనవరం శబరి వంతెన సమీపంలోని కొండమీద టెంట్లు వేసుకుని ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Godavari Flood: Why are the people of submerged areas still living in tents on the hills?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X