నూతన పార్లమెంట్ లో బంగారు రాజదండం: సెంగోల్ ప్రత్యేకతలు చెప్పిన కేంద్రమంత్రి అమిత్ షా
ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరగబోతోంది. ఈ మేరకు కేంద్రంలోని మోడీ సర్కార్ అందుకు కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారని, ప్రధాని మోడీ ఒక బంగారు రాజదండాన్ని కూడా స్పీకర్ కుర్చీ వద్ద ఆవిష్కరించనున్నారు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
బ్రిటిష్ వారు భారతీయులకు అధికారాన్ని అప్పగిస్తూ ఈ రాజదండాన్ని దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అప్పగించారని, ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని ఇది సెమ్మి అనే తమిళ పదం నుంచి ఉద్భవించింది అని చెప్పారు. ఇది చోళ కాలం నుండి చాలా ప్రాముఖ్యత వహించిందని అన్నారు.సెంగోల్ అంటే అర్థం ధర్మం అంటూ ఆయన వెల్లడించారు.

బ్రిటీషర్లకు భారతీయులకు మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండమే నిదర్శనమని గుర్తుచేశారు. ఈ రాజ దండాన్ని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ మన స్వతంత్ర భారత మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చారని చెప్పారు. సంపదకు ప్రతీక అయిన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాజదండం లాంటి సెంగోల్ ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
ఈ సెంగోల్ బ్రిటీష్ నుంచి భారత్ కు అధికారం సంక్రమించిన చిహ్నమని చెప్పారు. ఆగస్టు 14 1947 రాత్రి 10 గంటల 45 నిమిషాలకు నెహ్రూ తమిళనాడు నుండి ఈ రాజదండాన్ని స్వీకరించారని పేర్కొన్నారు. ఇది చారిత్రక కార్యక్రమమని, భారతదేశంలో ఇది అమృత కాలాన్ని గుర్తుచేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఈ రాజాదండాన్ని ఇంతకాలం అలహాబాద్ మ్యూజియంలో ఉంచామని దీనిని కొత్త పార్లమెంటు భవనానికి తరలించనున్నట్టు అమిత్ షా వెల్లడించారు.
నూతనపార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం ఇచ్చే ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీన కొత్తపార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్న సమయంలో నిర్మాణానికి దోహదం చేసిన దాదాపు 60వేల మంది కార్మికులను ప్రధానమంత్రి గౌరవించనున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.












Click it and Unblock the Notifications