రైతులకు నరేంద్ర మోడీ సర్కారు తీపికబురు: డీఏపీ ఎరువులపై 140 శాతానికి సబ్సిడీ పెంపు
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. డీఏపీ ఎరువుల ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలో ఉన్న రైతులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏపీ ధరల భారాన్ని రైతులపై మోపకుండా కేంద్రమే భరించేందుకు సిద్ధమైంది.
డీఏపీ ఎరువులపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం 140 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1700 ఉండగా, సబ్సిడీ రూ. 500తో రూ. 1200 మాత్రమే రైతులు చెల్లించేవారు. కానీ, ఇప్పుడు డీఏపీ ఎరువుల ధర రూ. 2400కు పెరిగింది. అయితే, ఈ పెరిగిన మొత్తాన్ని కేంద్రమే భరిస్తూ సబ్సిడీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు కూడా రైతులు రూ. 1200లకే డీఏపీ ఎరువులను పొందవచ్చు.

డీఏపీకి రూ. 1200 రైతు చెల్లిస్తే.. మరో 1200లను కేంద్రం నేరుగా కంపెనీలకు చెల్లించనుంది. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 14,775 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు.
కాగా, డీఏపీ ఎరువుల ధరలపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆసిడ్, అమ్మోనియా మొదలైనవాటి ధరలు పెరగడం వల్ల ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయని చర్చించారు.
అయితే, రైతులు పాత ధరలకే ఎరువులు పొందాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ.. డీఏపీ ఎరువుల రాయితీని ఒక్కో సంచిపై ఇచ్చే సబ్సిడీని రూ. 500ల నుంచి రూ. 1200లకు పెంచాలని ప్రధాని మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎరువుల సబ్సిడీని 140 శాతానికి పెంచినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications