దసరా, దీపావళి పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త!
భారతదేశంలో దసరా, దీపావళి పండుగలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగలను ప్రజలు చాలా విశేషంగా జరుపుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుంటూ వేడుకలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణాలు చేస్తారు. ఇక దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
పండుగలకు ప్రత్యేక రైళ్ళు, అదనపు కోచ్ లు.. ప్రకటించిన రైల్వే మంత్రి
దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని పండుగల సమయంలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటుగా అదనంగా రైల్వే కోచ్ ల సంఖ్యను కూడా పెంచుతున్నామని పేర్కొంది. ఈ సంవత్సరం ప్రయాణికుల కోసం అదనంగా 12, 500 కోచ్ లను ప్రస్తుతం ఉన్న రైళ్లకు జత చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు శుభవార్త చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 5975 ప్రత్యేక రైళ్ళు
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పండుగ సీజన్లో 108 రైళ్ళలో జనరల్ కోచ్ ల సంఖ్యను పెంచామని, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక రైళ్లకు 12,500కోచ్ లను అదనంగా జత చేసామని ఆయన వెల్లడించారు. 2024 - 2025 సంవత్సరంలోని పండుగల సీజన్లో ఇప్పటివరకు మొత్తం 5975ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించామని తాము తీసుకున్న నిర్ణయంతో దాదాపు కోటి మందికి పైగా ప్రయాణికులకు సౌకర్యం సులభతరమైందని ఆయన వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్ళ ప్రకటన
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రత్యేక రైళ్ల సంఖ్యను కూడా పెంచామని తెలిపారు. 2023 - 24 పండుగల సీజన్లో 4429 ప్రత్యేక రైళ్లను నడపగా, ఈ సంవత్సరం 5975 ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్టు వెల్లడించారు. ఇక మరోవైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కూడా ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్టు వెల్లడించింది.
ప్రజల ప్రయాణాలను సుగమం చేస్తున్న భారతీయ రైల్వే
దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ప్రయాణికులకు ప్రత్యేక రైళ్ళు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సేవలను అందిస్తూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వందే భరత్ వంటి రైళ్లను కూడా నడుపుతూ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. ఎంతోమందికి భారతీయ రైల్వే తమ రవాణా సదుపాయాలతో వారి ప్రయాణాన్ని సుగమం చేస్తుంది.
ప్రజల ప్రయాణ అవసరాలను తీరుస్తున్న రైల్వే
భారత దేశ ఆర్థిక ప్రగతికి కూడా భారతీయ రైల్వే బాటలు వేస్తుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దసరా, దీపావళి పండుగలకు మాత్రమే కాకుండా సంక్రాంతి, వినాయక చవితి వంటి పండుగలకు, కుంభమేళా వంటి సమయాలలో కూడా విశేషంగా సేవలను అందిస్తూ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ప్రజల అవసరాలను తీరుస్తుంది.












Click it and Unblock the Notifications