వందే భారత్ ప్రయాణికులకు రైల్వే శుభవార్త
రైల్వేశాఖ ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్ అందించింది. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు వందే భారత్ స్లీపర్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం స్లీపర్ కు సంబంధించిన డిజైన్ పనులు చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. డిసెంబరుకల్లా డిజైన్లు ఖరారవుతాయని, అనంతరం కోచ్ ల తయారీ ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.
మార్చి ఆఖరుకు ఇవి పట్టాలెక్కుతాయని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన నగరాల మధ్య సిట్టింగ్ సౌకర్యంతోనే తిరుగుతున్న వందే భారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు తయారుచేసి సుదూర ప్రాంతాల మధ్య రాత్రింబవళ్లు తిరిగేలా అందుబాటులోకి తేనున్నారు. వందేభారత్ రైళ్లల్లో మూడు రకాలున్నాయని.. అవి వందే మెట్రో, వందే చైర్ కార్, వందే స్లీపర్ అని రైల్వేశాఖ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించడంతోపాటు ఎక్కువ దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఇవి నడుస్తున్నాయి. త్వరలోనే సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య మరో రెండు వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి.












Click it and Unblock the Notifications