మధ్యప్రదేశ్‌లో 90డిగ్రీల వంతెన విషయంలో సర్కారు సీరియస్.. ఏడుగురిపై వేటు !
భోపాల్‌లోని ఐష్‌బాగ్ ప్రాంతంలో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ROB) ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సాధారణంగా వంతెనలు మృదువుగా మలుపులు ఉండేలా రూపొందిస్తారు.. కానీ ఈ వంతెన షార్ప్ టర్న్ కారణంగా ప్రమాదకరంగా మారింది. ఈ వంతెనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వంతెనపై చివర్లో 90 డిగ్రీల కార్నర్ ఉండటం ఏంటని విమర్శిస్తూ.. ప్రజల భద్రతకు ఇది ప్రమాదం అంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు.
అలానే స్థానికులు, ప్రయాణికులు ఈ వంతెనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వంతెనపై గమనించని వాహనదారులు ఒక్కసారిగా మలుపు కారణంగా ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇది పూర్తిగా ప్రజల ప్రాణాలను గాలికొదిలిన నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఘటనపై సీరియస్‌గా తీసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మొత్తం ఏడుగురు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. అలాగే నిర్మాణానికి బాధ్యులైన ప్రైవేట్ కాంట్రాక్టర్లు, కన్సల్టెన్సీ సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశారు. మాజీ చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా వంతెన రూపకల్పనపై విమర్శల నేపథ్యంలో నిర్మాణ సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మెట్రో స్టేషన్, రైల్వే ట్రాక్ లాంటి పరిమితులు ఉండటంతో స్థల కొరత కారణంగా 90 డిగ్రీల మలుపు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన స్థలాన్ని ముందే కేటాయించి ఉంటే, ఇదంతా తప్పినట్లయ్యేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు ప్రజల భద్రతను పరిగణలోకి తీసుకొని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాంకేతిక సమీక్షలు, భద్రత ప్రమాణాలు తప్పనిసరి చేయాలని.. ప్రజాధనం ఖర్చుపెడుతున్న ప్రతి నిర్మాణం అనేక కోణాల్లో పరిక్షించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications