చైనాతో సై అంటే సై అనేలా: అత్యాధునిక యుద్ధ సామాగ్రి: టాటా, ఎల్ అండ్ టీతో డీల్: వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక అడుగు ముందడుగు పడింది. అత్యాధునికమైన రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా.. అదే స్థాయిలో ఉండే పినాకా రాకెట్ లాంచర్లను అమ్ములపొదిలో చేర్చుకోబోతోంది. దీనికోసం 2,580 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. టాటా పవర్ కంపెనీ, లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) వాటిని తయారు చేయనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థలకు రక్షణమంత్రిత్వ శాఖ అధికారులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
Recommended Video
రక్షణమంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది. పినాకా రాకెట్ల లాంచర్లను అమర్చడానికి అవసరమైన భారీ వాహనాలను బీఈఎంఎల్ సరఫరా చేస్తుంది. ఆర్మీలోని ఆరు పినాకా రెజిమెంట్ల కోసం 114 ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ అండ్ పొజీషనింగ్ (ఏజీఏపీఎస్) అందుబాటులోకి వస్తాయి. మొత్తం 45 కమాండ్ పోస్ట్‌లకు వాటిని కేటాయిస్తారు. వాటిని అమర్చడానికి అవసరమైన 330 వాహనాలను బీఈఎంల్ సమకూర్చుతుంది. 2024 నాటికి అవి అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డీఆర్డీఓ ఈ పినాకా మల్టీపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌న అభివృద్ధి చేసిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తాన్ని కేటాయించడానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారని, రక్షణ మంత్రిత్వ శాఖ అందజేసిన ప్రతిపాదనలపై ఆమె ఆమోదముద్ర వేశారని అన్నారు. ఆ వెంటనే ఎల్ అండ్ టీ, టాటా పవర్స్‌తో రాకెట్ లాంచర్లను తయారు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. తొలిసారిగా కార్గిల్ యుద్ధ సమయంలో పినకా రాకెట్ లాంచర్లను వినియోగించారు. వాటిని మరింత అభివృద్ధి, అత్యాధునికంగా తీర్చిదిద్దబోతున్నారు.
లఢక్ వైపు వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో, నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునికమైన పినాకా రాకెట్ల లాంచర్లను కొనుగోలు చేయబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి గల పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఒప్పందాలకు రక్షణమంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications