విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిచ్చిన కేంద్రం.. తాజాగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించే పక్రియను చేపట్టింది.

మే 7 నుంచి ఎన్నారైల తరలింపు..
ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని మే 7 నుంచి దశలవారీగా విమానాల్లోనూ, నౌకల్లోనూ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. చెల్లింపుల ఆధారంగా ఈ సేవలు అందిస్తామని వెల్లడించింది. విదేశాల్లో చిక్కుకున్న వారి వివరాలను భారత రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు రూపొందిస్తున్నాయని, చెల్లింపుల ప్రాతిపదికన మే 7 నుంచి దశలవారీగా తరలింపు చేపడతామని ఆ ప్రకటనలో పేర్కొంది.

కరోనా లక్షణాలు లేకుంటేనే..
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ముందుగా స్క్రీనింగ్ నిర్వహించి, ఎలాంటి కరోనా లక్షణాలూ లేకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని హోంశాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. గమ్యస్థానాలకు చేరుకున్న వారంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి..
అంతేగాక, ఇక్కడికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్ ఉండాలని, గడువు ముగిశాక వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టింగ్, క్వారంటైన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. లాక్‌డౌన్ విధించడంతో విదేశాల్లోనే భారతీయులు చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విదేశాల్లోని భారతీయులకు స్వదేశానికి చేరుకోనున్నారు.