కాశ్మీర్‌లో 'జన కళ్యాణ్ పర్వ్': పాక్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కాశ్మీర్‌లో నిర్వహించిన 'జన కళ్యాణ్ పర్వ్' కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్రమోడీ 'సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్' మాటల్ని బుధవారం పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత భూభూగమైన కాశ్మీర్‌లో పాకిస్ధాన్‌కు అనుకూల నినాదాలు చేసే సానుభూతి పరులకు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్ధాన్ భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, అంతర్గత వ్యవహారాలు చూసకుంటే మంచిదని హెచ్చరించారు.
జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిని, దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఏమాత్రం భంగం కలిగించినా వూరుకునేది లేదని అన్నారు. ఈ విషయంలో భారత సైన్యంపై, పార్లమెంటరీ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలకు స్నేహ హస్తమే అందిస్తుందని, పాకిస్థాన్ సహా పొరుగుదేశాలతో మైత్రి బంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే పాక్ అందుకు వ్యతిరేకంగా ఉందన్నారు. దీనికి సంబంధించి గతేడాది అక్టోబర్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలను గుర్తు చేశారు.

ఇటీవల కాశ్మీర్ వ్యాలీలో జరిగిన హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీ ర్యాలీలో పాకిస్ధాన్ జెండాలు రెపరెపలాడటంపై స్పందించిన రాజ్‌నాథ్, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాశ్మీర్ వ్యాలీలో ఎవరైతే పాకిస్ధాన్‌కు మద్దుతుగా నినాదాలు చేశారో వారు 'మస్లింలు కారు' అని అన్నారు.
ఏ మతం కూడా తాను నివసిస్తున్న దేశంలో వేరే దేశానికి అనుకూలంగా నినాదాలు చేయడాన్ని ఆమోదించదని తెలిపారు. ఇక, యూపీఏ ప్రభుత్వం దేశ రక్షణ అంశాలను పట్టించుకోలేదని మండిపడ్డ ఆయన, ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 40 రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేసి దేశ రక్షణపై చిత్తశుద్ధి చాటుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications