ఇప్పుడూ రైతులకు మద్దతుగానే: గ్రేటా థన్‌బర్గ్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: మనదేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ మరోసారి తన మద్దతును తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఇప్పుడు కూడా రైతులకు మద్దతుగానే..
‘నేను ఇప్పుడు కూడా రైతుల ఆందోళనకు నా మద్దతు తెలియజేస్తున్నా. రైతుల శాంతియుత నిరసనలకు నా మద్దతు ఉంటుంది. ద్వేషం, బెదిరింపులే లేదా హింస, మానవ హక్కుల ఉల్లంఘనలకు తావులేదు' అంటూ ట్విట్టర్ వేదిక ఈ స్వీడిష్ పర్యావరణ కార్యకర్త తాజాగా పేర్కొన్నారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేసిన నేపథ్యంలో గ్రేటా థన్‌బర్గ్‌పై గురువారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన కాపేపటికే ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పాప్ స్టార్ రిహాన్నా కూడా రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత గ్రేటా థన్‌బర్గ్ స్పందించారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు గ్రేటా థన్
బర్గ్ ట్విట్టర్ వేదికగా మంగళవారం రాత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అప్‌డేట్ అంటూ గ్రేటా థన్‌బర్గ్ తాజా ట్వీట్
గురువారం గ్రెటా థన్‌బెర్గ్ ఇలా వ్రాశారు.. ‘మీరు సహాయం చేయాలనుకుంటే భారతదేశంలోని మైదానంలో ప్రజలు అప్‌డేట్ చేసిన టూల్‌కిట్ ఇక్కడ ఉంది. (వారు పాత పత్రాన్ని పాతది అయినందున తొలగించారు.) ఆందోళన గురించి వివరాలతో ఆమె ట్వీట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ తొలగించారంటూ రిహన్నా చేసిన ట్వీట్ చేసిన కాసేపటికే ఇలా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడకూడదంటూ రిహాన్నా ట్వీట్ చేశారు.
పోర్న్ స్టార్ మియా ఖలిఫా కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలపడం గమనార్హం.

మీకనవసరం.. భారత్ ఆగ్రహం..
కాగా, భారత అంతర్గత విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడంపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని హితవు పలికింది. సంచలనాల కోసం సెలబ్రిటీలు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు గ్రేటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ సెలబ్రిటీలు దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంపై భారత సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తగదంటూ మండిపడుతున్నారు.