GST 2.0:సిగరెట్‌పై పన్ను కొరడా..పొగతాగితే ఇక జేబుకు చిల్లు ఖాయం!
దేశంలో పొగాకు వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'జీఎస్టీ 2.0' సంస్కరణలలో భాగంగా పొగాకు ఉత్పత్తులపై పన్నుల భారాన్ని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. సిగరెట్లు, సిగార్లు, పాన్ మసాలా, హుక్కా వంటి ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న గరిష్ట పన్ను రేటు 28%తో పాటు అదనపు సుంకాలు విధించి, మొత్తం పన్ను భారాన్ని 53% వరకు పెంచనుంది. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించి, దానిపై అదనపు ఎక్సైజ్ లేదా ప్రత్యేక సుంకాన్ని విధించాలని కేంద్రం యోచిస్తోంది.
ఈ పన్ను పెంపుదలపై జీఎస్టీ మండలిలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.ఈ కొత్త పన్ను విధానం వల్ల లభించే అదనపు ఆదాయంలో తమకూ "గణనీయమైన వాటా" కావాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. చర్చల సమయంలో కొన్ని రాష్ట్రాలు అదనపు సుంకంపై సమాన వాటా అడిగినట్లు తెలుస్తోంది.
ఆరోగ్యానికి లాభం, ఖజానాకు బలం
కేవలం పన్నుల ద్వారానే కాకుండా, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తగ్గించాలనే లక్ష్యం కూడా దీని వెనుక ఉంది. పొగతాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్ను పెంచడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరిగి, సామాన్యులు, యువత వీటిని కొనుగోలు చేయడం తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గత ఐదేళ్లలో పొగాకు ఉత్పత్తుల నుంచి సగటున వార్షిక జీఎస్టీ వసూళ్లు ₹51,000 కోట్లుగా ఉన్నాయి. అదనంగా, ఇతర విద్యా సుంకాలు, సర్‌ఛార్జీల ద్వారా రూ.27,659.84 కోట్లు సమకూరాయి. పన్నుల పెంపుతో ఈ ఆదాయం మరింత పెరగనుంది.

బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ అంశంపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు మరోసారి సమావేశం కానుంది. ఈ సంస్కరణలు భారతదేశ పన్నుల వ్యవస్థలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాయని, దేశాన్ని 'వికసిత్ భారత్' దిశగా మరింత వేగంగా నడిపిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications