వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడ కాసినో... వీడియోల్లో ఏముంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇప్పడు ఆంధ్ర రాజకీయాలు కాసినో చుట్టూ తిరుగుతున్నాయి. సంక్రాంతి పండుగకు కోస్తా పల్లెల్లో జూదం ఆడడం దశాబ్దాలుగా ఉంది. కానీ ఈసారి గుడివాడలో జరిగిందని చెబుతోన్న ఒక జూదం మాత్రం అందరినీ ఆకర్షించింది.

స్థానికులు కూర్చున్న టేబుళ్ల ముందు ఉత్తరాది నుంచి వచ్చిన అమ్మాయిలు జూదం నిర్వహిస్తోన్న దృశ్యాలవి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో పైన తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో అలంకరించడం కనిపించింది.

ఇవి కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పు పట్టారు మంత్రి నాని.

అయితే ఏసెస్ కాసినో అనే సంస్థ విజయవాడ దగ్గర తాము జూదం నిర్వహించినట్టుగా చెబుతోన్న మూడు వీడియోలను ఇన్స్టాగ్రాంలో పెట్టింది.

బీబీసీ పరిశీలించినప్పుడు అవి తెలుగు రాష్ట్రాల్లో తీసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒక వీడియో బ్యాగ్రౌండ్ లో స్వింగ్ జర పాట ఆడియో వినిపించగా, మరో వీడియోలో తెలుగు మాటలు వినిపించాయి.

''ఐదు వేల నుంచి రెండు లక్షల వరకూ ఆడుకోవచ్చు’’ అని ఒకరు అరుస్తున్నారు. వీడియో తీయవద్దని ఒకర్ని వారిస్తుండగా, ''ప్రవీణ్ అన్నను అడుగు’’ అని హిందీలో చెప్పిన మాటలు వినిపించాయి.

https://www.instagram.com/p/CYxx_fzoGKL/?utm_medium=copy_link

ఇలా మొదలైంది..

సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కోడి పందేలు, గుండాట (ఒక రకమైన జూదం) వంటి ఎన్నో వీడియోలు బయట చక్కర్లు కొడుతుంటాయి. అలా ఈసారి గుడివాడ నుంచి వచ్చిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

సాధారణంగా పండుగ సమయంలో చెట్లు, టెంట్లు, పందిళ్ల కింద జూదం నిర్వహిస్తారు. కానీ గుడివాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెటప్ పలువురి దృష్టిని ఆకర్షించింది.

సినిమా సెట్ లాంటి హంగులతో, ప్రత్యేకంగా అలంకరించిన చోట, జూదాల వీడియోల్లో సాధారణంగా కనిపించని విధంగా అమ్మాయిలు జూదం ఆడించడం అందరికీ ఆసక్తి కలిగించింది.

పైగా సాధారణంగా కోస్తా పల్లెల్లో కనిపించే స్టైల్లో కాకుండా పెద్ద నగరాల్లోని కాసినోల తరహాలో జూదం ఆడే బోర్డులు, ఆట ఉండడం ఆ వీడియోలపై ఆసక్తిని ఇంకా పెంచింది.

పండుగ సమయంలో జూదం అందరికీ తెలిసిందే అయినా, ఇలా కాసినో తరహాలో ఇతర రాష్ట్రాల అమ్మాయిలు వచ్చి జూదం ఆడించడంపై విమర్శలు వచ్చాయి.

గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని నాయకత్వంలో ఇది జరగిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. గుడివాడను గోవాలా మార్చేశారంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. మంత్రి సొంత కళ్యాణ మండపంలో ఈ జూదం నిర్వహించారని ఆరోపించారు.

గుడివాడలో నిర్వహించినట్లు భావిస్తున్న కాసినో వీడియో

అంతే కాదు, శుక్రవారం తెలుగుదేశం తరపున ఒక బృందం నిజ నిర్ధారణ పేరుతో గుడివాడలో పర్యటించే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఆ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం నాయకులు బొండా ఉమ కారు అద్దాలు పగిలాయి. కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. రెండు పక్షాల వారూ పోటా పోటీగా రోడ్డెక్కారు. గుడివాడ రణ రంగాన్ని తలపించింది.

చివరకు పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. తెలుగుదేశానికి చెందిన 27 మంది, వైయస్సార్సీపీకి చెందిన 19 మంది నాయకులపై కేసులు పెట్టారు.

''ఆరుగురికి అనుమతిస్తే వందల మంది వచ్చినందుకే అడ్డుకున్నాం. రెండు పార్టీలనూ సమానంగానే అడ్డుకున్నాం. దీనిపై కృష్ణా పోలీసులు విచారణ చేస్తున్నారు’’ అని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన రావు మీడియాకు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ బృందం ఈ ఘటనలపై కృష్ణా జిల్లా కలెక్టర్, ఏలూరు రేంజ్ డీఐజీలకు ఫిర్యాదు చేసింది.

ఈ గొడవ తరువాత మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి కాసినో వ్యవహారంపై స్పందించారు.

''నా కళ్యాణ మండపంలో జూదం నిర్వహించారని నిరూపిస్తే రాజీనామాతో పాటూ, ఆత్మహత్య చేసుకుంటాను’’ అని ప్రకటించారు. కాసినోలు అంటే లోకేశ్‌కే బాగా తెలుసని ఆయన విమర్శించారు.

గుడివాడలో నిర్వహించినట్లు భావిస్తున్న కాసినో వీడియో

తెలుగుదేశం చూపిస్తున్న వివరాలు

కొడాలి నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం స్పందించింది. తమ ఆరోపణలకు మద్దతుగా ఆ పార్టీ చెబుతోన్న రెండు విషయాలను మీడియా ముందు ఉంచింది.

1. విజయవాడ దగ్గర పొంగల్ సందర్భంగా కాసినో నిర్వహిస్తున్నట్టు ఏసెస్ అనే కాసినో సంస్థ తన ఫేస్ బుక్ పేజీలో ప్రకటించింది. అంతేకాదు, ఆ పోస్టులో లొకేషన్ అనే చోట గుడివాడ అని చూపిస్తోంది. ఆ సంస్థ నిర్వాహకులైన ప్రేమల్ టోపీవాలా కూడా ఇదే పోస్టు షేర్ చేశారు.

2. గుడివాడ వచ్చి కాసినోలో పాల్గొన్న అమ్మాయిల వివరాలు అంటూ తెలుగుదేశం పార్టీ ఒక జాబితా విడుదల చేసింది. అందులో టికెట్లు బుక్ చేసిన ఎయిర్ లైన్స్ నంబర్లు, వారు విజయవాడ, బెంగళూరు మీదుగా గోవా వెళ్లిన విమానం వివరాలు, వారి పేర్లను (మొత్తం 13) తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య మీడియాకు విడుదల చేశారు.

ఈ రెండు విషయాలనూ బీబీసీ స్వయంగా నిర్ధరించడం లేదు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన సోషల్ మీడియా లింకుల్లోని పోస్టులు డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుడివాడ వచ్చిన అమ్మాయిల ప్రయాణం వివరాలను కూడా బీబీసీ నిర్ధరించడం లేదు.

వీటిని మీడియాకు విడుదల చేసిన తరువాత కొడాలి నానిపై ఇంకా దూకుడు పెంచారు తెలుగుదేశం నాయకలు.

''మేము సాక్ష్యాలు చూపించాం. కొడాలి నాని ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు?’’ అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.

చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం. ఇద్దరం తేల్చుకుందాం అన్నారు మరో తెలుగుదేశం నాయకుడు బొండా ఉమ.

సోమవారం ఉదయం ఈ అంశంపై తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. మంత్రి కొడాలి నాని చంద్రబాబు ఇంటి గేటు తాకినా తిరిగి శవాన్ని పంపుతామన్నారు.

"2024లో నాని ఓడిపోయిన తరువాత గుడివాడ ప్రజలే ఆయన్ను చంపుతామని అన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా తేల్చుకుందాం" అంటూ వ్యాఖ్యానించారు వెంకన్న.

అటు డీజీపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అంటే ఎద్దేవా చేశారు. ఈ డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కాసినోలో డీజీపీకి కూడా వాటా ఉందని ఆరోపించారు.

వెంకన్న వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు గంటల పాటూ ఇంటి దగ్గర విచారించి, చివరకు అరెస్టు చేశారు.

ఆయన అరెస్టు మరోసారి విజయవాడ దగ్గర ఉద్రిక్తతకు దారి తీసింది. కాసినో నిర్వహించిన వారిని పట్టుకోలేదు కానీ, విమర్శించిన వారిని అరెస్టు చేస్తున్నారంటూ పోలీసుల తీరును తప్పు పట్టారు తెలుగుదేశం నాయకులు.

అసలింతకీ ఆ కాసినో గుడివాడలో నిర్వహించారా లేదా అన్నది ఇంకా సాక్ష్యాధారాలతో మాత్రం తేలలేదు. ఆ విషయం తేల్చడానికి కృష్ణ జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును విచారణ అధికారిగా నియమించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ. ఆయన విచారణ పూర్తి చేస్తే తప్ప అది గుడివాడ కాసినోయో కాదో తెలియదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Gudivada Casino,What's in the videos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X