
గుజరాత్‌లో 37 ఏళ్ల కాంగ్రెస్ రికార్డును బద్దలు కొట్టిన బీజేపీ: దేశంలో రెండో పార్టీగా..!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయదుంధుభి మోగించింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో ఆ పార్టీ తిరుగులేని పట్టును చాటుకుంది. వరుసగా ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం విశేషం.

కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ..
గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 182 స్థానాలకు గానూ ఏకంగా 156 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1985లో కాంగ్రెస్ అప్పటి నేత మాధవ్ సిన్హ్ సోలంకీ సారథ్యంలో అత్యధికంగా 149 సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును బీజేపీ బద్దలు కొట్టింది.

అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 149.. ఇప్పుడు బీజేపీకి 156
ఈ చారిత్రక విజయంతో 37 ఏళ్ల రికార్డును భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసినట్లయింది. కాగా, గుజరాత్ రాష్ట్రంలో 1962 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత 154 నియోజకవర్గాలుండగా.. 1972 తర్వాత 182 నియోజకవర్గాలకు పెంచారు. దీంతో 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో 149 స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత ఇప్పడి వరకు ఆ స్థాయిలో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడం గమనార్హం. తాజాగా, బీజేపీ 156 సీట్లు గెల్చుకుంది.

బెంగాల్‌లో సీపీఎం.. గుజరాత్‌లో బీజేపీ రికార్డులు
ఈ క్రమంలో 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 121 సీట్లతో విజయం సాధించింది. అప్పట్నుంచి బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. ఇక తాజా ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. వరుసగా ఏడోసారి ఒకేపార్టీ విజయం సాధించడం దేశంలో ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. బీజేపీ కంటే ముందు పశ్చిమబెంగాల్ ను సీపీఎం వరుసగా 34 ఏళ్లపాటు (1997 నుంచి 2011 వరకు) పాలించింది. ఇప్పుడు బీజేపీ మాత్రమే ఆ రికార్డును సాధించింది. మరోసారి కూడా గెలిస్తే సీపీఎం రికార్డు కూడా బ్రేక్ అవుతుంది.