గోవధకు ముగ్గురికి జీవిత ఖైదు..! వేదాలు, మనుస్మృతి ప్రస్తావనతో గుజరాత్ కోర్టు తీర్పు ..!
దేశంలో మనుస్మృతి, గోవధ వంటి అంశాలపై చర్చ జరుగుతున్న తరుణంలో గుజరాత్ (Gujarat) లోని ఓ స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గోవధకు పాల్పడిన ముగ్గురు ముస్లిం యువకులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చే క్రమంలో మనుస్మృతి, రుగ్వేదాలను, ప్రాచీన గ్రంథాలను సైతం ప్రస్తావించింది. వీటి ఆధారంగా తాము ఈ తీర్పు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో భారతీయ శిక్ష్మాస్మృతిని పాటించే న్యాయస్దానం.. వేదాలు, మనుస్మృతి ప్రకారం తీర్పు ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతోంది.
2024 ఆగస్టు 22న గుజరాత్ లోని జమ్లా గ్రామంలోని ఒక ఇంట్లో పోలీసులు తనిఖీలు చేసి నిందితులు అక్రమంగా గోవులను వధించారని, ఆ మాంసాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారని గుర్తించి, వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సుమారు 277 కిలోగ్రాముల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కత్తులు, గొడ్డలి, త్రాసు, తాళ్లు, వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గాంధీ నగర్ లోని కలోల్ స్ధాని కోర్టులో ఈ గోవధ కేసు విచారణకు వచ్చింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ రామేశ్వర్ సింగ్ రాజ్ పుత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం గోవధ చేసే వ్యక్తుల్ని శిక్షించకపోతే గోవులు అంతరించిపోయే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

గోవుల శరీర భాగాలను క్రూరంగా ముక్కలు చేసి వేరు చేసిన ఇటువంటి నిందితులను చట్టప్రకారం శిక్షించకపోతే, కాలక్రమేణా భూమిపై నుండి గోమాత అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. కావున, నిందితులకు చట్టప్రకారం శిక్ష విధించడం అవసరమని భావించి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, గోవులను ప్రపంచానికి తల్లులుగా, గోరక్షణను ఒక ధార్మిక కర్తవ్యంగా పేర్కొనే సంస్కృత శ్లోకాలను కోర్టు ఉదహరించారు. "గోవులు జగత్తుకు మాతృస్వరూపాలు, అవి అందరికీ సుఖసంతోషాలను కలిగిస్తాయి. గోవులను రక్షించడం ఒక ధార్మిక కర్తవ్యం; సత్యానికి రక్షకమే న్యాయం. గోవధ ఎక్కడ జరిగినా, అది ధర్మానికి జరిగిన నష్టంగా పరిగణించబడుతుంది. నేరం రుజువైనప్పుడు, చట్టప్రకారం శిక్ష విధించాల్సిందే. రాజా! న్యాయమార్గం ద్వారానే ధర్మం నిలబడుతుంది. జీవరాశులను రక్షించడం పుణ్యకార్యం, న్యాయాన్ని కాపాడటమే అత్యున్నత ధర్మం." అంటూ న్యాయమూర్తి రాజ్ పుత్ తీర్పులో ప్రస్తావించారు.














Click it and Unblock the Notifications
