అసెంబ్లీ ఎన్నికల వేళ..మోదీ-షా సొంత రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్..!!
అహ్మదాబాద్: ఇంకొద్దిరోజులే..గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన తొలి విడత, 5వ తేదీన మలి విడత పోలింగ్ జరుగనుందా రాష్ట్రంలో. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారతీయ జనత పార్టీ అధికారంలో ఉంది. ఈ దఫా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది 8వ తేదీన తేలిపోతుంది.

ప్రచార వేడి..
పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ ప్రచార ఉధృతిని పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించగలిగితే దాని పానుకూల ప్రభావం 2024 నాటి సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని భావిస్తోన్నాయి.

పోలింగ్ షెడ్యూల్..
గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటన్నింటికీ రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.

బీజేపీకి బిగ్ షాక్
ఈ పరిస్థితుల మధ్య బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన కుమారుడు సమీర్ వ్యాస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. అహ్మదాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

మోదీ కేబినెట్‌లో..
జై నారాయణ్ వ్యాస్‌కు నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పని చేసినప్పుడు ఆయన మంత్రివర్గంలో వ్యాస్ కొనసాగారు. కీలక శాఖలను పర్యవేక్షించారు. సిద్ధ్‌పూర్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా అప్పట్లో విజయం సాధించారు. వైద్య ఆరోగ్యం సహా పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీకి దూరం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు.

బీజేపీపై ఖర్గే విమర్శలు..
ఈ ఎన్నికల్లో గుజరాత్ ఓటర్లు తమ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, దీనికి నిదర్శనం వ్యాస్ చేరికేనని అన్నారు. తమ గెలుపు ఖాయం కావడం వల్లే బీజేపీ జాతీయ స్థాయి నాయకులు గుజరాత్‌లోనే మకాం వేసుకుని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు, మొరార్జీ దేశాయ్ పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. వాటన్నింటినీ పక్కన పెట్టి తాను మాత్రమే అభివృద్ధి చేశానంటూ మోదీ గొప్పలు చెబుతున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications