పరువు హత్య కలకలం.. కులాంతర ప్రేమకు బలైన కూతురు!
సామాజిక ఆచారాలు, కుల ప్రాతిపదికన కన్న ప్రేమలను బలితీసుకుంటున్న పరువు హత్యల వంటి ఘాతుకాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వేడుకగా జరుపుకోవాల్సిన దీపావళి పండుగ నాడే ఓ తండ్రి తన 21 ఏళ్ల ఏకైక కూతురిని పీక నొక్కి దారుణంగా హత్య చేసిన సంఘటన గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో వెలుగుచూసింది. వేరే కులానికి చెందిన యువకుడిన ప్రేమించిందనే ఆగ్రహంతో తండ్రే సొంత కూతురిని కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రేమ వివాహానికి తండ్రి నిరాకరణ
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖంబాత్ తాలూకా మేత్‌పూర్ గ్రామానికి చెందిన కౌశల్‌కుమార్ పటేల్ కూతురు సాన్యా పటేల్(21) వడోదరలో బీకాం పూర్తి చేసింది. ఆమె గతేడాది కాలంగా తన గ్రామానికి చెందిన వేరొక కులానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి కౌశల్ కుమార్ సదరు యువకుడి కులం, ఆర్థిక పరిస్థితి నచ్చక ఆ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రేమను వదులుకోవాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ సాన్యా పటేల్ తన నిర్ణయానికే కట్టుబడింది.

దీపావళి రాత్రి జరిగిన దారుణం
దీపావళి పండుగ రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోయిన తర్వాత అర్థరాత్రి సమయంలో తండ్రీకూతుళ్ల మధ్య వంటగదిలో మళ్లీ ప్రేమికుడి విషయమై ఘర్షణ జరిగింది. ప్రేమను వదులుకోమని తండ్రి ఒత్తిడి తేగా.. సాన్యా పటేల్ నిరాకరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన కౌశల్‌కుమార్, ఆమె ధరించిన దుపట్టాతోనే పీక బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
వెలుగులోకి తెచ్చిన పోస్టుమార్టం రిపోర్టు
హత్య అనంతరం ఈ దారుణాన్ని గుండెపోటు లేదా సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు తండ్రి ప్రయత్నించాడు. బాలిక మృతదేహాన్ని ఖంభాత్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులకు అనుమానం వచ్చి మృతదేహాన్ని ఫోరెన్సిక్ పోస్టుమార్టానికి పంపించారు. పోస్టుమార్టం రిపోర్టులో మెడపై ఒత్తిడి పడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు స్పష్టమైంది. వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనే స్వయంగా కూతురిని చంపినట్లు కౌశల్‌కుమార్ అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది.














Click it and Unblock the Notifications
