తెలంగాణలో రూటు మార్చిన బీజేపీ- రంగంలోకి పార్టీ చీఫ్, లక్ష మందితో...!!
తెలంగాణ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్య నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటనలకు ప్లాన్ చేసారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహా పాదయాత్ర నిర్వహించారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఆసక్తిగా మారుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యం గా బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణలో అమలు చేస్తున్న వ్యూహం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.
తెలంగాణ కేంద్రంగా బీజేపీ దూకుడు పెంచింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ తర్వాత ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ కేంద్రమైన కరీంనగర్‌ను పార్టీ తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది. నవంబర్ 18న కరీంనగర్‌లో నిర్వహించనున్న భారీ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా పాల్గొననున్నారు.

పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష మంది ప్రజలు, కార్యకర్తలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
'సర్' అంశంపై కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నితిన్ నబీన్ తొలిసారి కరీం నగర్‌కు వస్తుండటంతో కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు.
గాంధీ సర్కిల్, వైశ్య భవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఇందులో నితిన్ నబీన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బండి సంజయ్ పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా మహా పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది.














Click it and Unblock the Notifications
