ఎస్! ఇది నిజం: అహ్మద్ పటేల్ గెలుపు, కాంగ్రెస్‌కు చివరి హెచ్చరిక

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థాయిలో పరాభవం.. అటు పిమ్మట హర్యానా, మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ.. కశ్మీర్ రాష్ట్రాల్లో ఓటమి.. బీహార్‌లో మహా కూటమితో విజయం మినహా కాంగ్రెస్ పార్టీకి గత లోక్ సభ ఎన్నికల నుంచి ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి.

కానీ ఆ పార్టీ నాయకత్వం మాత్రం ఇంకా నిద్ర మేల్కొన్నట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన స్ఫూర్తితో పాత కాపు జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను మాయోపాయాల ద్వారా ఆర్జేడీ - కాంగ్రెస్ పార్టీలతో ఏర్పాటైన మహా కూటమి సర్కార్‌ను కూలగొట్టి మరీ ప్రజాతీర్పును తోసి రాజని అధికారమే పరమావధిగా ఎన్డీయే కూటమికి తరలించుకువెళ్లిన ఘనాపాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ద్వయం. వారు అంతటితో ఆగలేదు.

చివరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లక్ష్యంగా రాజ్యసభ ఎన్నికల్లో ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు రాజకీయ వ్యూహం అమలుజేశారు. మోదీ - షా ద్వయం సొంత రాష్ట్రం గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అనైతిక పద్దతుల్లో అర్థ, అంగ చతురంగ బలాలను బరిలోకి దించి రాజకీయం నడిపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి కానరాని అమిత్ షా కసరత్తు

కాంగ్రెస్ పార్టీకి కానరాని అమిత్ షా కసరత్తు

విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల్లో ఒక్కసారి దెబ్బ తింటే తిరిగి జవసత్వాలు పుంజుకుని దూసుకెళ్లడంలో పోటీ దారుల లక్షణం. కానీ చివరి క్షణాల వరకు.. నైతికతను, సామర్థ్యతను సవాల్ చేసే స్థాయికి అర్థ, అంగ బలంతో కూడిన రాజకీయ వ్యూహాల రచనాంగం సాగుతున్నా.. కొన్ని నెలల ముందు నుంచి కసరత్తు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కళ్లు తెరవలేదంటే ఆ పార్టీ ఎంత పరిస్థితి నామమాత్రావశిష్టంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ పార్టీకి ఇలా వాఘేలా రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి ఇలా వాఘేలా రాజీనామా

బీహార్ రాష్ట్రంలో మహా కూటమికి బీటలు వారిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలా తాను బీజేపీలో చేరబోనని ప్రకటించినా రాజకీయంగా అస్త్ర సన్యాసం చేయబోనన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన సూచనలను లెక్క జేయడం లేదని నిష్ఠూరాలాడారు. ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఏడుగురు విడిగా వ్యవహరించారు. మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వం తెర వెనుక నుంచి రాజీనామాలు చేయించింది. రాజీనామా చేసిన వారిలో బలవంత్ సిన్హా రాజ్‌పుత్‌తో రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయించింది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మౌనంగా వ్యవహరించింది.

ఇలా కర్ణాటకకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

ఇలా కర్ణాటకకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు వైదొలిగిన తర్వాత ఒక ఎమ్మెల్యేను సాక్షాత్ జిల్లా ఎస్పీ కిడ్నాప్ చేయడం సంచలనంగా మారిన తర్వాత గానీ కాంగ్రెస్ పార్టీకి వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తాను అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోకి 44 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. అక్కడా కేంద్రం ఊరుకోలేదు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు చేసింది. అదేమంటే చట్టం పని చట్టం చేసుకుపోతుందని.. తమ పాత్ర లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి వారి ముక్తాయింపులు ఇచ్చారు.

అమిత్ షాకు బ్యాలెట్ పత్రాల ప్రదర్శన

అమిత్ షాకు బ్యాలెట్ పత్రాల ప్రదర్శన

ఎట్టకేలకు 44 మంది ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రానికి అహ్మదాబాద్ పక్కనే ఉన్న ఆనంద్ జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. గమ్మత్తేమిటంటే మంగళవారం పోలింగ్ మొదలైన తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తమ పోలింగ్ ఏజంట్ కు బ్యాలెట్ పత్రాలు చూపకుండా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చూపడం విప్ ను ఉల్లంఘించడమే అవుతుంది. గతేడాది హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొరపాటున చూపినా చెల్లదని ఎన్నికల సంఘం తేల్చేసింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సరళి ఓటమి అంచుకు చేరిందని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కలవరపడింది. ఆగమేఘాల మీద సదరు ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించొద్దని సీనియర్లు ఆజాద్, ఆనందశర్మ, పీ చిదంబరం తదితరులతో కూడిన ప్రతినిధుల టీం.. రెండు దఫాలు కేంద్ర ఎన్నికల సంఘం తలుపు తట్టింది.

గెలుపుపై అహ్మద్ పటేల్ ఆనందం ఇలా

గెలుపుపై అహ్మద్ పటేల్ ఆనందం ఇలా

బీజేపీ సైతం అందునా న్యాయశాఖ మంత్రిగా ఉన్న రఘు వంశీ ప్రసాద్ పొద్దంతా టీవీలో అమిత్ షాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పత్రాలు చూపినట్లు చానెళ్లలో ప్రచార హోరెత్తించిన తర్వాత అవకతవకలు జరుగలేదని, తక్షణం కౌంటింగ్ చేపట్టాలన్న విజ్నప్తికి ఈసీ నిరాకరించడంతో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం ఖరారైంది. ఎట్టకేలకు సంక్లిష్ట పరిస్థితుల్లో అహ్మద్ పటేల్ 44, అమిత్ షా 46, కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ 45 ఓట్లతో గెలిచినట్లు బుధవారం తెల్లవారుజామున ఎన్నికల సంఘం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఊపిరి పీల్చుకున్నది. కష్టకాలంలో అండగా నిలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపిన అహ్మద్ పటేల్ తన తదుపరి లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలేనని తేల్చి చెప్పారు.

మూడేళ్లలో మోదీ సర్కార్ చేసింది శూన్యం

మూడేళ్లలో మోదీ సర్కార్ చేసింది శూన్యం

అహ్మద్ పటేల్ విజయంతో కాంగ్రెస్ పార్టీకి నైతికంగా బలం చేకూరినట్లయింది. వచ్చే ఐదు నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నందున అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందునా జీఎస్టీ అమలు, గతేడాది నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరితో పటేళ్లు, ప్రత్యేకించి గుజరాతీ మార్వాడీ వ్యాపారులు గుర్రుగా ఉన్నారు. 1995 నుంచి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్నారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పాటిదార్లు చేపట్టిన ఆందోళన గుజరాత్ అంతటా ప్రకంపనలు రేకెత్తించింది. దీనికి తోడు 2014 వరకు రాష్ట్ర సీఎంగా ఉన్న మోదీ, ఆయన సహచరుడిగా అమిత్ షా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ సొంత రాష్ట్రం కనుక వ్యూహాల అమలుకు వారిద్దరి ధ్వయం పదును పెట్ట వచ్చు. అయితే గత మూడేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ సర్కార్ ప్రజా సంక్షేమానికి చేసిన మేలేమి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇలా కొత్త అస్త్రం

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇలా కొత్త అస్త్రం

అందువల్లే ఇరు పార్టీల్లోనూ రాజకీయ వ్యూహకర్తలుగా భావించిన అహ్మద్ పటేల్, అమిత్ షాలకు రాజ్యసభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు గానీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుసరించిన తెగింపు రాజకీయాలకు యావత్ భారతావని సాక్షీభూతంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అహ్మద్ పటేల్ విజయం కాంగ్రెస్ పార్టీకి గట్టి మేలు రాయి కాగా, వ్యూహకర్తగా దూసుకెళ్తున్న అమిత్ షాకు తొలి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. అధికారంలోని బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీకి నూతన అస్త్రం అందుబాటులోకి వచ్చినట్టేనని అంటున్నారు.

బీజేపీ వ్యతిరేక శక్తులకు ఇలా ప్రయోజనం

బీజేపీ వ్యతిరేక శక్తులకు ఇలా ప్రయోజనం

కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మంత్రి శివకుమార్ రిసార్ట్‌లో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బస కల్పించడం కమలనాథులకు కంటగింపుగా మారింది. వెంటనే ఆదాయం పన్ను శాఖ (ఐటీ) అధికారులను దాడులకు ఉసిగొలిపిన సంగతి కాంగ్రెస్ పార్టీ అంత తేలిగ్గా తీసుకునే అవకాశమే కనిపించడం లేదు. అర్థ, అంగ బలాలతో కూడిన బీజేపీ అనైతిక రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ గుజరాతీల్లో విస్త్రుతంగా ప్రచారంచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా అహ్మద్ పటేల్, ఆ పార్టీలో నిద్రాణశక్తులుగా ఉన్న కార్యకర్తలకు మేల్కోలుపు వంటిదే అవుతుందని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అందుబాటులో లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుని నవంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు దూసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. హార్దిక్ పటేల్ వంటి బీజేపీ వ్యతిరేక శక్తులకు నైతిక బలాన్నిచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As voting began for three Rajya Sabha seats, Congress candidate Ahmed Patel expressed confidence that he will win. BJP’s Amit Shah, Smriti Irani and Balwantsinh Rajput too are in fray.Voting is taking place for the high-stakes Rajya Sabha elections in Gujarat The outcome will not only decide which three of the four candidates in the fray go to the Upper House of Parliament but also have a bearing on the two powerful leaders of India’s major parties - Amit Shah of the BJP and Ahmed Patel of the Congress.
Please Wait while comments are loading...