రూ. 2 వేలు కట్టలేక భార్య, కూతురుపై ఓనర్ తో అత్యాచారం చేయించాడు..!
రాను రాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న వారిని.. కన్న వాళ్లని హతమార్చిన ఉదంతాలు ఎన్నో.. ఇక మనీ.. మానవుడ్ని రాక్షసుడిగా మారుస్తుందనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ. 2 వేలు ఇంటి అద్దె కట్టలేక భార్య, కూతురుపై ఓనర్ తో అత్యాచారం చేయించాడు ఓ దుర్మార్గుడు. ఎట్టకేలకు భార్య, కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తితోపాటు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు.
గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం మోర్బి ప్రాంతానికి ఆరు నెలల క్రితం వలస వచ్చారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబ పెద్ద ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. అద్దె బకాయిలు పేరుకుపోయాయి. దాంతో వాటి మాఫీ కోసం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై ఇంటి ఓనర్ అత్యాచారానికి అతడు అనుమతించాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి భార్య, కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయంపై ఆ వ్యక్తి భార్య తల్లికి తెలిసింది. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మోర్బి పోలీస్ స్టేషన్ లో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆ వ్యక్తిని, ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications