
గుజరాత్: ఈ చంటి బిడ్డను రెండుసార్లు ఎందుకు కిడ్నాప్ చేశారు?

గుజరాత్‌లోని దినసరి కూలీ దంపతులకు జన్మించిన రెండు నెలల శిశువును ఇప్పటికి ఒకటి కాదు రెండుసార్లు కిడ్నాప్ చేశారు. ఎందుకలా జరిగిందో బీబీసీ గుజరాత్ ప్రతినిధి భార్గవ పరీఖ్ కనుగొన్నారు.
'ఇక నా కొడుకుపై నుంచి నా దృష్టిని మరల్చను' అని గాంధీనగర్‌కు చెందిన పేద కూలీ మీనా వాదీ అన్నారు.
రెండు నెలల వ్యవధిలో 2 సార్లు తన బిడ్డ అపహరణకు గురికావడాన్ని25 ఏళ్ల ఆ తల్లి ఇంకా మరచిపోలేకపోతున్నారు.
ఆసుపత్రి నుంచి బిడ్డతో ఇంటికి వచ్చిన మరుసటిరోజు అంటే ఏప్రిల్ 1నుంచి మీనా కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు.
మీనా చెప్పినదాని ప్రకారం తాను ప్రసవించిన ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నానంటూ ఒక మహిళ మీనా ఇంటికి వచ్చింది. శిశువుకు టీకా ఇవ్వాలని చెప్పింది. దాంతో బాబును తీసుకొని మీనా ఆ మహిళ వెంట ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షల నిమిత్తం శిశువును లోపలికి తీసుకెళ్లిన ఆ మహిళ మీనా బయటే వేచి చూడాలని చెప్పింది.
గంటలు గడిచినా మహిళ తిరిగిరాలేదు. ఆమె కోసం మీనా వెతకడం ప్రారంభించారు. 'నా ఏడుపు విన్న భద్రతా సిబ్బంది ఏం జరిగిందని అడిగారు. జరిగింది వారికి చెప్పడంతో పోలీసులను పిలిచారు' అని మీనా తెలిపారు.
- '12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 'సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’

మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్‌లో గతేడాది 43,000 మంది చిన్నారులు తప్పిపోయారు. గుజరాత్‌లో 3,500 మంది చిన్నారులు అదృశ్యమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
పిల్లలు తప్పిపోయినట్లు పేద తల్లిదండ్రులు అరుదుగా ఫిర్యాదు చేస్తారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. అయితే మీనా, ఆమె భర్త ఖాను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్వేషణ సాగిందిలా...
'బాబును తీసుకెళ్లిన మహిళ వివరాలేవీ మీనాకు తెలియవు. కనీసం ఆమె పేరు కూడా. ఆమె ఆనవాళ్లు కూడా మీనా వివరించలేకపోయింది' అని కేసు దర్యాప్తు చేసిన పోలీస్ ఇన్ స్పెక్టర్ హెచ్‌పీ జాలా తెలిపారు.
ఆసుపత్రి చుట్టుపక్కలా ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా జాలా బృందం దర్యాప్తు చేపట్టింది. అందులో తన చీరలో ఏదో మూటను దాచుకొని వెళ్తోన్న మహిళను గుర్తించారు. కానీ అది శిశువేనా? అనేది అనుమానమే.
500మంది రిక్షా డ్రైవర్లను ప్రశ్నించాక పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. ఫుటేజీలో కనిపించిన మహిళ దగ్గర శిశువు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఆ మహిళ రిక్షాలో పొరుగు గ్రామానికి వెళ్లినట్లు గుర్తించారు.
ఆమెను వెతుకుతూ వెళ్లిన పోలీసులకు అక్కడి పాడుబడిన పొలంలో మహిళ బట్టలు, ఆధార్ కార్డు దొరికాయి. దానిలో ఉన్న అడ్రస్‌కు చేరుకున్న పోలీసులకు శిశువుతో ఉన్న మహిళ కనిపించింది. కానీ, ఆ శిశువు మీనా బిడ్డ కాదు.
ఆ మహిళను విచారించగా తన భర్త మరో మహిళతో పారిపోయాడని తెలిపింది. అతను వెళ్లే సమయంలో తన వస్తువులు, గుర్తింపు కార్డులను దొంగిలించినట్లు పేర్కొంది. రెండో వివాహం తర్వాత తనకు ఆ శిశువు జన్మించినట్లు వెల్లడించింది.
'ఆమె భర్త కోసం మేం అన్వేషించాం. ఆమె చెప్పిన అడ్రసులో ఒక జంట శిశువుతో నివసించడాన్ని కనుగొన్నాం. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఆ శిశువు మీనా బిడ్డగా గుర్తించాం' అని జాలా వివరించారు.
శిశువును ఎత్తుకెళ్లిన జంటను అరెస్ట్ చేయగా, బెయిల్‌పై వారు బయటకు వచ్చారు.
తాను మీనా బిడ్డను కిడ్నాప్ చేసినట్లు మహిళ ఒప్పుకుంది. ఇందులో ఆ వ్యక్తి తొలి భార్యను ఇరికించడానికి ఆమె బట్టలు, గుర్తింపు కార్డులను పొలంలో పడేసినట్లు చెప్పింది. తాను ఒక మృత శిశువుకు జన్మనిచ్చినట్లు ఆమె వెల్లడించింది. బిడ్డ లేకుండా ఇంటికి వెళితే తన భర్త వదిలేస్తాడనే ఇలా చేశాననే చెప్పుకొచ్చింది.
కానీ ఈ విషయమంతా తనకు తెలియదని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు. శిశువును తన సొంత బిడ్డే అనుకున్నట్లు వివరించాడు.
నిందితురాలు చెప్పిన కథ అక్కడ మామూలేనని పోలీసులు పేర్కొన్నారు.
'తల్లిదండ్రులు ఆడపిల్లకు బదులుగా మగపిల్లవాడే కావాలనే కోరుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనే వారికి అబ్బాయే కావాలి. ఈ పిచ్చితనంతోనే పేదింటి పిల్లల్ని అపహరిస్తున్నారు' అని మాజీ పోలీసు అధికారి దీపక్ వ్యాస్ తెలిపారు.
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

రెండోసారి అపహరణ
తమ బిడ్డ తిరిగి వచ్చాడనే సంతోషం మీనా దంపతులకు అంతలోనే ఆవిరైంది.
రెండు నెలల తర్వాత అంటే జూన్ 9న వారి శిశువు మరోసారి అదృశ్యమయ్యాడు.
బాబును చెట్టుకు కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి చెత్త సేకరిస్తున్నట్లు మీనా తెలిపింది. తిరిగి వచ్చి చూస్తే బిడ్డ లేడని వాపోయింది.
ఖాను, మీనాల ఫిర్యాదుతో ఇన్ స్పెక్టర్ జాలా మరోసారి ఆ ప్రాంతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బిడ్డ కనబడకుండా పోయిన రోజు ఒక వ్యక్తి శిశువుతో బైక్‌పై వెళ్లినట్లు గుర్తించారు.
ఆ వ్యక్తిని కనిపెట్టి విచారించగా... ఆరోజు బైక్‌పై ఉన్న వ్యక్తి తన మిత్రుడని వెల్లడించారు. అతను పొరుగునే ఉన్న రాజస్థాన్ నివాసిగా పేర్కొన్నాడు.
రాజస్థాన్ పోలీసుల సహాయంతో జాలా బృందం... ఆ వ్యక్తి ఇంటిలో సోదాలు నిర్వహించి శిశువును కనిపెట్టారు. అతనితో పాటు భార్యను అరెస్ట్ చేశారు.
తమకు పిల్లలు లేనందునే మీనా శిశువును కిడ్నాప్ చేసినట్లు వారిద్దరూ తెలిపారు.
'నిందితుడు మీనా భర్త ఖాను పనిచేసే నిర్మాణ స్థలంలోనే పనిచేసేవాడు. వారి శిశువు గురించి తెలిసే ప్రణాళిక ప్రకారం అపహరించాడు' అని ఇన్ స్పెక్టర్ జాలా వెల్లడించారు.
మీనా నాలుగు రోజుల తర్వాత తన కుమారున్ని కలుసుకుంది.
శిశువు భద్రత కోసం పోలీసులు తరచూ తనిఖీలు చేస్తున్నారు. బాబు కోసం బహుమతులు కూడా తెస్తున్నారని మీనా చెప్పారు.
'మా కన్నా పోలీసులే బాబుపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు' అని మీనా పేర్కొంది.
జాలా కూడా దీన్ని ఖండించలేదు. 'బాబును నిరంతరం పర్యవేక్షిస్తాం' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)