జ్ఞానవాపి మసీదులో పూజలకు పిటిషన్-విచారణకు అలహాబాద్ హైకోర్టు లైన్ క్లియర్..
యూపీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం రూపంలో కనిపించిన ప్రతిమలకు పూజలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ వారణాసి కోర్టులో హిందూ మహిళా భక్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. వారణాసి కోర్టులో విచారణను నిలిపేయాలని కోరుతూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించిన ప్రధాన కేసుల్లో ఒకటైన మసీదు కమిటీకి ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది.వారణాసి స్దానిక కోర్టులో హిందూ భక్తుల పిటిషన్ పై విచారణను సస్పెండ్ చేయాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ప్రార్థనలు చేసే హక్కును కోరుతూ హిందూ భక్తులు దాఖలు చేసిన వ్యాజ్యం చెల్లుబాటు అవుతుందని, వారణాసి జిల్లా కోర్టులో కేసును కొనసాగించడానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో తమ విగ్రహాలు ఉన్నాయని శృంగార్ గౌరీ దేవత, ఇతర దేవతలను క్రమం తప్పకుండా పూజించే హక్కును కోరుతూ ఈ కేసులో వ్యాజ్యదారులు లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్ ఆగస్టు 2021లో కేసు వేశారు.సెప్టెంబరు 2022లో వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు విచారణను సమర్థించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సెప్టెంబర్ 2022 తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఇది 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్ వక్ఫ్ చట్టం ప్రకారం చెల్లదని వాదించారు. కానీ ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
దీంతో ఇప్పుడు వారణాసి కోర్టులో హిందూ భక్తుల పిటిషన్ పై విచారణ కొనసాగేందుకు లైన్ క్లియర్ అయినట్లయింది. అసలే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ వివాదం యూపీలో అగ్గి రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications