Vinesh Phogat: పొలిటికల్ ఎంట్రీపై సెన్సేషనల్ కామెంట్స్..!!
Vinesh Phogat:వినేష్ ఫోగట్.. ఈ పేరు తెలియని వారుండరు. కొన్ని వందల గ్రాముల బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో మెడల్ సాధించే అర్హత కోల్పోయింది. అయినప్పటికీ ఆమె కృంగిపోలేదు. దేశం మొత్తం ఆమె వెంట ఉండి మద్దతుగా నిలిచింది. ఇక వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతోందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.
వినేష్ ఫోగట్ హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడేతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వినేష్ ఫోగట్ పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి ఒక ఛాయిస్‌తో రాలేదని తన అవసరం ఉన్నందున వచ్చినట్లు పేర్కొన్నారు.అంతేకాదు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం, కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయడం, హర్యనా పట్ల తన విజన్ ఇలా చాలా అంశాలను ప్రస్తావించారు.

2024 ఒలింపిక్స్ అనంతరం తాను రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే తన పోరాటం కేవలం రెజ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాకూడదని అదే పోరాటం ప్రజాశ్రేయస్సుకోసం చేయాలని చాలామంది తనను కోరినట్లు చెప్పారు. ప్రజల కోసం వారి పిల్లల కోసం తనలోని పోరాట శక్తిని చావనివ్వలేదని వెల్లడించారు. మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు దిగుతున్న ఫెడరేషన్ పెద్దలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు వినేష్ ఫోగట్. ఆ సమయంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొన్న వినేష్‌ను ఈ ఘటన మరింత బలపడేలా చేసిందని గుర్తు చేసుకున్నారు.
"మేము రోడ్డెక్కి నిరసన తెలిపాము. కానీ మాకు ఫలితం కనిపించలేదు. పైగా చిన్నచూపు చూశారు. అవమానించారు. ఒలింపిక్స్‌కు వెళ్లాను. నాకు అక్కడా న్యాయం జరిగిందా..? లేదు. అందుకే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఇక్కడి నంచి వ్యవస్థలను మార్చేందుకు వెసులుబాటు ఉంటుంది" అని వినేష్ ఫోగట్ అన్నారు. వినేష్ ఫోగట్ చేసిన పోరాటం రాజకీయ ప్రేరేపితం అని కొందరు అన్నారని ప్రశ్నించగా అసలు ఈ పోరాటం చేసేందుకే అనుమతి ఇచ్చింది ఇద్దరు బీజేపీ నేతలని అలాంటప్పుడు కాంగ్రెస్ పై నింద వేసే ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. అంటే ఈ అంశంపై బీజేపీలోనే సఖ్యత లేదని అన్నారు.
రాజకీయాల్లోకి రావాలనకున్నప్పుడు మహిళలు రోడ్డెక్కాల్సిన అవసరం లేదని, బట్టలు చిరిగిపోయినా తమకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన పని లేదని, జుట్టు పట్టుకుని ఈడ్చిన అనిగి మనిగి ఉండాల్సిన పనిలేదని వినేష్ ఫోగట్ అన్నారు.అప్పటికే దేశం తరపున ఎన్నో పతకాలు సాధించి, ప్రజల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు చాలా సులభంగా రాజకీయాల్లోకి ఏదో ఒక పార్టీ తరపున వచ్చేదాన్ని అని స్పష్టం చేశారు.మహిళా రెజర్లు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే బ్రిజ్ భూషణ్ సింగ్ పై బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పైగా తాము అబద్ధాలు చెబుతున్నామంటూ అంతా బ్రిజ్ భూషణ్‌కే మద్దతుగా నిలిచారని వినేష్ ఫోగట్ గుర్తు చేశారు. తాము సాధించిన మెడల్స్ గంగా నదిలో కలిపేస్తామని బెదిరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే వారించలేదని మమతా బెనర్జీ కూడా అలా చేయొద్దని చెప్పారని గుర్తు చేసింది.మేము ధర్నా చేసే చోటికి అప్పటి ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వచ్చారని గుర్తు చేసుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ వారు కాదని తెలిపింది. అందువల్ల రెజ్లర్ల నిరసన వెనుక ఒక కాంగ్రెస్ పార్టీ ఉందని చెబుతున్న బీజేపీ ఈ ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని వినేష్ కోరింది.
ఒకసారి మేము ముస్లింలని, మరోసారి మేము పాకిస్తాన్ మద్దతుదారులమని, ఇంకోసారి ఖలిస్తాన్ మద్దతుదారులమని ఇలా పలు కోణాల్లో చెడుగా మాపై ముద్రవేసే ప్రయత్నం బీజేపీ చేసిందని వినేష్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపై ఇలాంటి రాజకీయాలు నడవవనే విషయం కమలం పార్టీ పెద్దలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి రంగంలో మొదట కష్టాలే ఉంటాయని చెప్పిన వినేష్ ఫోగట్.. ఆదిలో రెజ్లింగ్‌లో కూడా కష్టాలను ఎదుర్కొని పోరాడామని, రాజకీయాలు కూడా ఇంతే అని వివరించారు.
ఇక హర్యానాపై తన విజన్‌ను వివరించిన ఫోగట్.. ముందుగా ఇక్కడి ప్రజలు, వారి అవసరాలను గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. తాను కేవలం జులానా నియోజకవర్గంకే పరిమితం కాకూడదని మొత్తం రాష్ట్రం అభివృద్ధిలో తన మార్క్ కనిపించేలా చేస్తానని ఫోగట్ అన్నారు. యువ అథ్లెట్లకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అని చెప్పుకొచ్చారు. వారి హక్కుల కోసం పోరాడేందుకు వెనుక ఒకరున్నారనే భరోసా కల్పిస్తానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications