కాంగ్రెస్ సంచలన నిర్ణయం..
Haryana Assembly election 2024: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ బహిరంగ సభలు, రోడ్ షోలు హోరెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ-జన్ నాయక్ జనతా పార్టీ, ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఒకే దశలో పోలింగ్ షెడ్యూల్ అయింది హర్యానాలో. అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 జనరల్ సీట్లు. 17 స్థానాలు ఎస్సీ రిజర్వ్‌డ్.
మొత్తం 20.1 మిలియన్ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 10.6 మిలియన్ల మంది పురుషులు, 9.5 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 4,52,000 మంది మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాగా- ఈ ఎన్నికల్లో మొత్తం 89 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక్క స్థానాన్ని మాత్రం మిత్రపక్షం సీపీఎంకు కేటాయించారు. ప్రస్తుతం అందరి దృష్టి కూడా జులానా నియోజకవర్గంపైనే ఉంది. దీనికి కారణం- అక్కడ రెజ్లర్ వినేష్ ఫొగట్ పోటీ చేస్తోండటమే. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు.
ఈ పరిణామాల మధ్య పార్టీకి చెందిన 13 మందిపై కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వేటు వేసింది. ఆరు సంవత్సరాల పాటు వారిని బహిష్కరించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది.
బహిష్కరణకు గురైన వారిలో నరేష్ ధండే- గుహ్లా, పర్దీప్ గిల్- జింద్, సజ్జన్ సింగ్ ధుల్- పుండ్రి, సునిత బట్టన్- పుండ్రి, రాజీవ్ మామూరామ్ గోండర్- నిలోఖేరీ, దయాల్ సింగ్ శిరోహి- నిలోఖేరీ, విజయ్ జైన్- పానీపట్ రూరల్, దిల్‌బాగ్ సందిల్- ఉఛనా కలాన్, అజిత్ ఫొగట్- దాద్రి, అభిజిత్ సింగ్- భివానీ, సత్‌బీర్ రటేరా- భివానీ ఖేరా, నీతూ మాన్- ప్రిథ్లా, అనితా ధుల్ బద్‌సిక్రి- కలాయత్ ఉన్నారు. ఆరు సంవత్సరాల పాటు వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications