హర్యానా ఎన్నికలు: 31 మందితో కాంగ్రెస్ తొలి జాబితా, వినేశ్ ఫోగట్‌కు సీటు ఖరారు
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 31 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫోగట్‌తో పాటు బజరంగ్ పునియా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగింది. బద్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చర్చ సాగింది. కానీ, ఇప్పుడు విడుదల చేసిన జాబితాతో బజరంగ్ పేరు లేకపోవడం గమనార్హం. అలానే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా ఘర్హి అస్లెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

సురేందర్ పన్వార్‌కు సోనిపట్ నుంచి, జగ్‌బీర్ సింగ్ మాలిక్‌కు గోహనా నుంచి, భరత్ భూషణ్ బత్రాకు రోహ్‌తక్ నుంచి టికెట్ ఇచ్చారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ హోడల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లాడ్వాలో కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్.. హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత నయాబ్ సైనీతో తలపడనున్నారు.
బద్లీ స్థానం నుంచి కాంగ్రెస్ కులదీప్ వాతా, ఝజ్జర్ నుంచి గీతా భుక్కల్ (ఎస్సీకి రిజర్వ్ చేయబడింది), రేవారి నుంచి చిరంజీవ్ రావ్, నుహ్ నుంచి అఫ్తాబ్ అహ్మద్, ఫరీదాబాద్ ఎన్ఐటీ నుంచి నీరజ్ శర్మ బరిలోకి దిగారు.
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఇన్‌ఛార్జ్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) హర్యానా ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా, హుడా తదితరులు హాజరయ్యారు.
హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 12, పత్రాల పరిశీలన సెప్టెంబరు 13, సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మరోవైపు, ఈ వారం ప్రారంభంలో, 67 మంది అభ్యర్థులతో బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications