వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంగ, మనిషి స్నేహానికి రాజకీయం అడ్డొచ్చిందా.. ఏడాదిగా మహ్మద్ ఆరిఫ్‌ పెంచుకుంటున్న పక్షిని అధికారులు హఠాత్తుగా ఎందుకు తీసుకెళ్లారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన మహ్మద్ ఆరిఫ్‌ ఏడాది కాలంగా సారస్ అనే ఓ పెద్ద కొంగను పెంచుతున్నారు. రెండు రోజుల కిందట అటవీ శాఖ అధికారులు వచ్చి దానిని తీసుకువెళ్లారు.

ఏడాది కిందట ఆ కొంగ గాయపడి ఎగరలేని పరిస్థితులలో ఉన్నప్పుడు ఆరిఫ్ చూసి దానికి చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆ పక్షి అతని వెంటే తిరగడం ప్రారంభించింది. ఆరిఫ్ ఇంటి వద్దే ఉంటోంది. ఆరిఫ్, ఆ కొంగ ఒకే ప్లేటులో ఆహారం తింటుంటారు.

ఆ కొంగను సారస్ అని పిలుచుకుంటూ ఆరిఫ్ కూడా దాని బాగోగులన్నీ చూస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొంగతో కలిసి తింటున్న, దాంతోపాటు తిరుగుతున్న వీడియోలు ఆరిఫ్ పెడుతుంటారు..వాటికి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.

అయితే, ఆ కొంగను తాను ఎప్పుడూ బందీగా ఉంచలేదని, అది స్వేచ్ఛా పక్షి అని ఆరిఫ్ చెప్తున్నారు.

ఇంతకుముందు అటవీశాఖకు చెందిన ఏ అధికారి కూడా తన నుంచి సమాచారం తీసుకోవడానికి రాలేదని చెప్పారు.

మీడియాలో సారస్, ఆరిఫ్ కథను చూసిన తర్వాత యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అమేథీ వెళ్లి ఆరిఫ్, ఆ కొంగను కలిశారు.

కొంగతో దిగిన చిత్రాన్ని కూడా అఖిలేష్ పంచుకున్నారు.

బుధవారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్‌తో పాటు మహ్మద్ ఆరిఫ్ పాల్గొన్నారు.

అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ''ఆరిఫ్ కొంగకు సేవ చేసి, దానితో స్నేహం చేశారు. కొంగ మనిషితో కలిసి జీవించడం, ప్రవర్తన మారడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

కొంగ వారి వద్ద ఎలా ఉంటుందనేదే పరిశోధనాంశం. నేను వెళ్లినందుకే కొంగను లాక్కున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రభుత్వమే కొంగను లాక్కుంటుంటే నెమలికి ఆహారం ఇచ్చే వారి నుంచి నెమలిని కూడా లాక్కోవాలి కదా?.

అక్కడికి చేరుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా. అక్కడికి వెళ్లి నెమలిని తీసుకొచ్చే ధైర్యం ఏ అధికారికైనా ఉందా? కొంగను, దాన్ని పెంచిన ఆరిఫ్‌ని నేను కలిశాననే ప్రభుత్వం ఇలా చేసింది" అని అఖిల్ ఆరోపించారు.

సారస్ కొంగ

ఆరిఫ్ ఏమంటున్నారు?

అఖిలేష్ యాదవ్ విలేకరుల సమావేశం అనంతరం మహ్మద్ ఆరిఫ్‌తో బీబీసీ హిందీ మాట్లాడింది. అటవీ శాఖ బృందం మంగళవారం కొంగను తీసుకెళ్లిందని ఆరీఫ్ తెలిపారు.

కొంగను టెంపోలో తీసుకెళ్తున్న వీడియోను కూడా ఆరిఫ్ బీబీసీ హిందీకి అందించారు. దీనికి సంబంధించిన కొన్ని వైరల్ వీడియోలు చూసి ఆరిఫ్ కుంగిపోయారు.

"పై నుంచి ఆర్డర్ వచ్చింది. అది సమస్పూర్ (పక్షుల సంరక్షణ కేంద్రం)కి వెళ్తుంది" అని అటవీ అధికారులు తనతో చెప్పారని ఆరిఫ్ బీబీసీకి తెలిపారు.

కొంగల గురించి సమాచారం ఇవ్వడానికి మీరు ఎప్పుడైనా అటవీ శాఖను సంప్రదించారా అని బీబీసీ ఆరిఫ్‌ను ప్రశ్నించగా "నాకు వన్యప్రాణుల గురించి పెద్దగా తెలియదు.

నేను రైతును. అందుకని ఆ విషయం నాకు తెలీదు. కానీ నాకు ఏం తెలుసంటే.. మనం దాన్ని ఎప్పుడు బంధిస్తామో, కట్టేస్తామో అప్పుడు అటవీ శాఖ ప్రశ్నిస్తుంది. కానీ, ఈ కొంగ దాని ఇష్టపూర్వకంగా వచ్చింది" అని అన్నారు.

కొంగ రక్షిత పక్షి అని, దాన్ని పక్షి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లి అటవీ శాఖ తన డ్యూటీ తాను చేస్తోందని ఆరీఫ్ అంగీకరించారు.

అలాంటప్పుడు ఆరిఫ్ అభ్యంతరం ఏమిటి? దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ''మాకేమీ ఇబ్బంది లేదు.. దాన్ని ఏ విధంగానూ కట్టడి చేయలేదు. మేం దాన్ని జైలులో ఉంచలేదు. అది పొలాల్లో తిరుగుతుంది, అక్కడ అది ఎగురుతూ ఉండేది. అనంతరం తిరిగి వచ్చేది.

దాన్ని ఎప్పుడూ పట్టుకోలేదు, కట్టేయలేదు. అటవీ శాఖ వన్యప్రాణుల నిబంధనల గురించి మాకు పెద్దగా తెలియదు. వారు దాన్ని తీసుకువెళ్లారు" అని ఆరిఫ్ అన్నారు.

కొంగను సమీపంలోని సమస్పూర్ బర్డ్ శాంక్చురీకి తీసుకెళ్లినట్లు ఆరిఫ్ చెప్పారు.

20 నుంచి 25 రోజుల వరకు సమస్పూర్ పక్షుల అభయారణ్యం దగ్గర కనిపించవద్దని అటవీ శాఖ అధికారులు తనతో చెప్పారని ఆరిఫ్ అన్నారు.

అయితే, ఆరిఫ్ మాత్రం "దాన్ని వదిలేయండి. తిరిగి నా దగ్గరకే వస్తుంది" అంటున్నారు.

Priyanka

ఆరిఫ్‌కు ప్రియాంక గాంధీ మద్దతు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అటవీ శాఖ చర్యపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

"అమేథీ నివాసి ఆరిఫ్, కొంగల స్నేహం జై-వీరు లాంటిది. కలిసి జీవించడం, కలిసి తినడం, కలిసి రావడం. వారి స్నేహం మానవులు, జంతువుల మధ్య స్నేహానికి ఉదాహరణ. ఇంటి సభ్యుడిలా కొంగను పెంచాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, ప్రేమించాడు.

ఇలా చేయడం ద్వారా ఆయన జంతువులు, పక్షుల పట్ల మనిషికి గల బాధ్యతను ఉదాహరణగా అందించాడు, ఇది ప్రశంసించదగినది" అని అన్నారు.

ఆస్కార్‌ గెలుచుకున్న ఎలిఫెంట్ విస్పర్స్ ఏనుగు, మానవుని సున్నితమైన కథ ఆధారంగా రూపొందించారని ప్రియాంక గుర్తుచేశారు.

మానవ జీవితంలో, పర్యావరణంలో ఉన్న శక్తి కారణంగా ఈ కథలు మనల్ని కదిలిస్తాయని, ప్రభుత్వాలు కూడా అటువంటి కథలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు.

కొంగ

ప్రభుత్వం ఏం చెబుతోంది?

అమేథీలోని స్థానిక విలేకరుల నుంచి బీబీసీ మార్చి 20న ఒక అధికారిక లేఖను అందుకుంది. దీనిలో ఉత్తరప్రదేశ్‌ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సునీల్ చౌదరి మార్చి 14న అమేథీ ఫారెస్ట్ డివిజన్‌లోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌ డీఎస్ సింగ్‌కి తన లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చారు.

అమేథీలోని ఆరిఫ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న కొంగను సమస్పూర్ పక్షుల అభయారణ్యంలో చేర్చడానికి అనుమతిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఇందుకోసం అమేథీ జిల్లాకు చెందిన ఒక వెటర్నరీ వైద్యుడి సాయం తీసుకోవాలని సూచించారు.

వన్యప్రాణి (రక్షణ) చట్టం 1972లోని సెక్షన్-48A ప్రకారం సమస్‌పూర్ పక్షుల అభయారణ్యంలో విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, సునీల్ చౌదరి, డీఎస్ సింగ్‌తో పాటు సమస్‌పూర్ పక్షుల అభయారణ్యం రేంజర్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.

అయితే ఫోన్‌లో ఎవరూ అందుబాటులోకి రాలేదు.

సమస్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రంలో కొంగను చేర్చడంపై బరేలీ ప్రాంతీయ అటవీ అధికారి రూపేష్ శ్రీవాస్తవతో బీబీసీ ప్రతినిధి వివేక్ కుమార్ మౌర్య రాయ్ మాట్లాడారు.

సారస్ పక్షిని మార్చి 21న సమస్పూర్ పక్షుల అభయారణ్యంలో వదిలిపెట్టినట్లు ఆయన ధ్రువీకరించారు. పక్షిని ఏ గదిలోనూ ఉంచలేదని, స్వేచ్ఛగానే వదిలివేసినట్లు స్పష్టంచేశారు.

పక్షి ఎగిరిపోతే మళ్లీ తీసుకువస్తారా? అని ప్రశ్నించగా దీనిపై శ్రీవాస్తవ స్పందిస్తూ.. గ్రామంలో ఎక్కడికి వెళ్లినా, ఇంటికి వెళ్లినా అధికారులు తిరిగి తీసుకువస్తారన్నారు.

కొంగ తనంతట తాను తింటున్నప్పటికీ గోధుమలు, నీళ్లు, రొట్టెలు విడివిడిగా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే కొంగను చూడటానికి మహమ్మద్ ఆరిఫ్ సమస్పూర్‌కి వస్తాడా? అనే పశ్నకు రీజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రూపేష్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. టిక్కెట్లతో వచ్చి చూడొచ్చు. గుర్తించొచ్చు అని అన్నారు.

అరిఫ్, కొంగ

కొంగ సంరక్షణ గురించి నిపుణులు ఏమంటున్నారు?

బీబీసీకి చెందిన గీతా పాండే కొంగల సంరక్షణ గురించి మరింత తెలుసుకోవడానికి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన సమీర్ కుమార్ సిన్హాతో మాట్లాడారు.

సమీర్ సిన్హా మాట్లాడుతూ "రక్షిత పక్షి లేదా జంతువును ఉంచుకోవడం చట్టవిరుద్ధం. వాటికి ఆహారం ఇవ్వడం కూడా చట్టవిరుద్ధం" అని స్పష్టంచేశారు.

రక్షణ, కరుణ రెండు వేర్వేరు విషయాలని సమీర్ చెబుతున్నారు.

"మీరు పక్షిని రక్షించవచ్చు, కానీ ఆ తర్వాత మీరు దాన్ని చట్టబద్ధంగా అప్పగించాలి. ఇది చేయకపోతే, ఇతరులు కూడా అలాంటి పక్షులను ఉంచుకుంటారు.

అడవి జంతువులకు అడవి ప్రవృత్తులు ఉంటాయి. ఆ పక్షి ఎవరిపైనైనా దాడి చేస్తే ఎలా ఉంటుంది?" అని ప్రశ్నించారు.

కొంగ గురించి ఆయన మరింత సమాచారం ఇస్తూ "కొంగ ఒక రాష్ట్ర పక్షి, చిత్తడి నేలలను కాపాడటానికి, పక్షుల నివాసాలను కాపాడటానికి ప్రయత్నిస్తే సరైనది. అప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది." అని స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Has politics hindered the friendship between stork and man? Why did the authorities suddenly take away the bird that Mohammad Arif was raising for a year?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X