• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆనందయ్య కరోనా మందు వివాదంతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందా?

By BBC News తెలుగు
|

ఆయుర్వేదం

'ఆనందయ్య మందు'ను నాటు మందుగానే గుర్తిస్తున్నామని, ఆ మందును ఆయుర్వేద మందు అనలేమని ఆయుష్ కమిషనర్ ప్రకటించారు. అయితే ప్రజల్లోకి మాత్రం అది ఆయుర్వేద మందుగానే ప్రచారంలోకి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందుకు రాష్ట్రంలో గిరాకీ పెరిగిపోయింది. ఆయుర్వేద మందుల అమ్మకాలు ఎన్నడూ లేనంతగా ఈ కరోనా సమయంలో వంద నుంచి రెండు వందల శాతం పెరగడమే అందుకు నిదర్శనం.

కరోనాకు తోడు ఇప్పుడు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ అంటూ మరికొన్ని కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ ప్రాణాంతక వ్యాధులే. వీటి బారిన పడకుండా ఉండాలన్నా, అనుకోకుండా ఈ వ్యాధులకు గురైనా... బయట పడేందుకు మార్గం ఇమ్యూనిటీ పెంచుకోవడం.

అందుకే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు, మందుల కోసమే అంతా చర్చించుకుంటున్నారు. ఇలా ఇమ్యూనిటీకి ఆయుర్వేదంలో అనేక మందులు లభిస్తుండటం, 'ఆనందయ్య మందు' ప్రభావంతో జనాలు ఇప్పుడు ఆయుర్వేద మందుల వైపు పరుగులు తీస్తున్నారు.

నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది

ఇమ్యూనిటీ బూస్టర్లు

కరోనా కాలంలో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడటానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు, మందులపైనే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేద మందులను ఆశ్రయిస్తున్నారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటీ నుంచి సంప్రదాయ ఉత్పత్తులైన కబాసుర కుడినీర్‌, శంషమనివటి ,అశ్వగంధ, నిషామలకి వటి, సుదర్శన ఘన వటి, ఆయుష్‌ 64 వంటి మందుల సేల్స్ ఊహించని విధంగా పెరిగాయి.

ఫస్ట్ వేవ్ సమయంలో చవన్‌ప్రాష్ అమ్మకాలు గతేడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు 700% పెరిగాయి. ఇక కరోనా, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులపై పని చేసే కబాసుర కుడినీర్‌, శంషమని వటి ,అశ్వగంధ, నిషామలకివటి, సుదర్శన ఘనవటి మందుల అమ్మకాలైతే రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఫార్మా ఇండస్ట్రీ మందులు, పరిరాలకు రేటింగ్ ఇచ్చే బ్రిక్ వర్క్ రేటింగ్స్ సంస్థ తెలిపింది.

"శరీరంలోని రక్షణ వ్యవస్థల శక్తిని పెంచే అనేక మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. 'ఆనందయ్య మందు' అని చెబుతున్నది కూడా మన వంటిల్లు, పెరడులో లభించే సాధారణ పదార్థాలతో తయారైనదే. ఇవే కరోనాపై పని చేస్తున్నాయి" అని విశాఖలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సోమయాజులు తెలిపారు.

సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు

పెరిగిన ఆయుర్వేద మార్కెట్

వివిధ సర్వేల ప్రకారం హెల్త్‌‌ ప్రాడక్టుల సేల్స్‌‌ ఏటా 5 నుంచి 10 శాతం పెరుగుతాయి. అయితే, అవి ప్రస్తుతం 20 నుంచి 40 శాతానికి పెరిగాయి. ఇందులో ప్రధానంగా ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆలివ్‌‌, సోయా, మస్టర్డ్‌‌ ఆయిల్స్, బ్రెడ్‌‌, బిస్కెట్స్, చాక్లెట్స్ డ్రింక్స్‌‌, మల్టీ గ్రెయిన్‌‌ బార్స్‌‌ వంటి సేల్స్ 30 శాతం పెరిగాయి. అలాగే దేశంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ వాటా సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది.

"మెడికల్‌‌ షాపుల్లో మల్టీ విటమిన్లు, ప్రోటీన్ పౌడర్లు, ఆయుర్వేద పొడులు, మందులు, ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్టుల అమ్కకాలు భారీగా పెరిగాయి. ఆయుర్వేద మార్కెట్ గత ఆరు నెలలుగా చూసుకుంటే 50-90% వరకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కోవిడ్. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులున్నాయి. అయితే ప్రభుత్వాలే దీనిని ప్రొత్సహించాలి. కేరళలో ఆయుర్వేదానికి మంచి ఆదరణ ఉంది. మనలో చాలా మంది నయంకానీ రోగాలతో వైద్యం కోసం కేరళకు వెళ్తుంటారు. 2026 నాటికి ప్రతి ఏటా 15% చొప్పున ఆయుర్వేద మార్కెట్ పెరుగుదన ఉంటుందని, ఆయుర్వేదం ఒక పెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని నివేదికలు చెప్తున్నాయి" అని సోమయాజులు అన్నారు.

అనూహ్యంగా పెరిగిన డిమాండ్

ఆయుర్వేదం అంటే కరోనాకు ముందు అదేదో నాటు వైద్యమని... గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో చేసే వైద్యమని ఎక్కువ మంది భావించేవారు. అయితే, కరోనా మొదలైనప్పటీ నుంచి ఇమ్యూనిటీ కోసం ఎక్కువ మంది ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. దీంతో కరోనా ఫస్ట్ వేవ్ నుంచి క్రమంగా సేల్స్ పెరుగుతూ ఇప్పుడు ఊహించనంత స్థాయికి ఆయుర్వేదం మందులు అమ్మకాలు జరుగుతున్నాయని షాపు యాజమానులు చెబుతున్నారు.

"గతంలో రోజంతా షాపు తెరచుకుని కూర్చుంటే రోజుకు 3 వేల వరకు అమ్మకాలు సాగేవి. కానీ, ఇప్పుడు రోజూ పది వేలకు పైగానే అమ్మకాలు సాగుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఇంతకు ముందు ఆయుర్వేద దుకాణాలకు నడివయసు, వృద్ధులే ఎక్కువగా వచ్చేవారు. కానీ, ఇప్పుడు యువత కూడా పెద్ద సంఖ్యలో మా దుకాణానికి వస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఆయుర్వేద మందుల అమ్మకాలు 200 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఆయుర్వేద మందుల వలన సైడ్ ఎఫెక్ట్ ఉండకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. అందుకే, కరోనా కాలంలో అంతా ఆయుర్వేద మందుల వైపు చూస్తున్నారు." అని నెల్లూరు జిల్లా గుడూరులోని సిద్ధా ఆయుర్వేద మందుల దుకాణం యాజమాని మంజునాథ్ చెప్పారు.

కాన్ఫిడెన్స్ పెంచిన 'ఆనందయ్య మందు'

'ఆనందయ్య మందు'పై జరుగుతున్న చర్చతో ఆయుర్వేదానికి మంచి డిమాండ్ వచ్చింది. 'ఆనందయ్య మందు' జనాల్లో కాన్ఫిడెన్స్ పెంచింది. ఇదే సగం జబ్బు నయమవడానికి కారణమవుతోందని తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ద్రవ్యాగుణ విభాగాధిపతి డాక్టర్ రేణు దీక్షిత్ బీబీసీతో చెప్పారు.

"ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందనే భయంతో ప్రజలంతా ఇమ్యూనిటీపై దృష్టి పెట్టారు. ఇమ్యూనిటీ బూస్టర్లంటే మన వంటింట్లో ఉండే ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, తేనె లాంటి పదార్థాలే. ఇవే రోగనిరోధక శక్తి పెంచుతాయి. తులసి, లెమన్ ఫ్లేవర్స్ తో ఉండే గ్రీన్ టీ, కాఫీలు కూడా ఇమ్యూనిటీ బూస్టర్లే".

"అల్లోపతిలో కూడా ఇమ్యూనిటీ బూస్టర్లు ఉన్నప్పటీకి,సైడ్ ఎఫెక్ట్ లేని తక్కువ ఖర్చుతో వచ్చే ఇమ్యూనిటీ బూస్టర్లు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేద ఉత్పత్తుల్లో తిప్పతీగ, అశ్వగంధ పౌడర్, అమృతారిష్టం, అశ్వగ్రంథ చూర్ణం, ఆయుస్కావద చూర్ణం, ద్రాక్షాది కషాయం ఇలా ఏదైనా ఇమ్యూనిటీ కోసం వాడవచ్చు. అయితే ఏదీ వాడినా ముందు వైద్యుల సలహా తీసుకోవాలి." అని డాక్టర్ రేణు దీక్షిత్ చెప్పారు.

మా వాడికి తగ్గింది... అదే చాలు

ఆయుర్వేద మందులు కరోనాకు పని చేస్తున్నాయనే ప్రచారం ఊపందుకోవడంతో వాటి కోసం క్యూ కడుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఏలూరు ఇలా ప్రతి చోటా ఆయుర్వేద షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది.

"నా తమ్ముడికి కరోనా వచ్చింది. వాడి కోసం ఆయుర్వేద మందులు వాడాను. ఆయుర్వేద మందులు ప్రభావం వల్లనే మావాడు కోలుకున్నాడనే నమ్మకం నాది. కబాసుర కుడినీర్‌, తిప్ప తీగ, అశ్వ గంధ, వంటి మందులు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడ్డాయి. ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు మా ఇంట్లో అందరం ఆయుర్వేద మందులు వాడుతన్నాం. మా ఊర్లో కిడ్నీ రోగాలకు సైతం ఆయుర్వేద మందులే వాడుతున్నారు" అని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వైకుంఠం చెప్పారు.

ఆనందయ్య మందు

అల్లోపతితో పోల్చితే ఖర్చు చాలా తక్కువ

వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేద మందులను పనితనాన్ని నిరూపించాలని కొన్నేళ్ల కిందటే వచ్చిన అల్లోపతి వైద్య నిపుణులు అనడం హాస్యాస్పాదమని కొందరు ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అల్లోపతి పరిభాషలో ఆయుర్వేదాన్ని నిరూపించాలని చూడటం విడ్డూరంగా ఉందని విశాఖకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎన్వీఎస్ హరగోపాల్ అన్నారు.

"సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి వ్యాధికైనా మందును ఇవ్వగలిగేది ఆయుర్వేదం. అల్లోపతితో పోల్చుకుంటే ఖర్చు చాలా తక్కువ. కరోనా చికిత్సకు ఆయుర్వేదంలో 7 వందల నుంచి 2 వేల వరకు మాత్రమే ఖర్చవుతుంది. ఇతర ఆయుర్వేద మందులు కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి' అని ఆయన వివరించారు.

"నెల్లూరు 'ఆనందయ్య మందు' కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ లో ఆనందయ్య మందుతో పాటు అనేక ఇతర ఆయుర్వేద మందులంటూ తెరమీదకు వచ్చాయి. ఏవేవో ఆకులు, మూలికలు కలిపేసి మందు అంటూ అమ్మతున్నారు. ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం" అని ఉత్తరాంధ్ర హిమాలయ హెర్బల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ రమేష్ చెప్పారు.

3 వేల నుంచి 10 వేల వరకు మందును విక్రయిస్తున్నారని, ఇది కేవలం కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని ఆయన చెప్పారు. ఆనందయ్యకు పాపులారిటీ రావడంతో అనేక మంది కొత్తగా కరోనాకు ఆయుర్వేద మందంటూ తెర మీదకొచ్చారని ఆయన చెప్పారు.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, ఆయా కాలాల్లో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను తినడం మంచిది

మొక్కలన్నీ మందులే...

ప్రస్తుతం మా వద్దకు వచ్చే వారిలో ఎక్కువ మంది ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ గురించి అడుగుతున్నారు. అలాగే చాలా మంది ఆయుర్వేద మందులవైపు వెళ్తున్నారు. ఆయుర్వేద మందులన్నీ మొక్కలు, చెట్లు, బెరళ్లు నుంచి వచ్చేవే. వీటిలో దాదాపు అన్నీ జౌషధ గుణాలు కలిగి ఉంటాయి. కరోనా సమయంలో ఆయుర్వేద మందులపై ప్రజలకు ఆసక్తి పెరిగిన మాట వాస్తవం అని డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు.

"మన పరిసరాల్లో ఉండే చెట్లు, మొక్కల చెందిన ఏ భాగమైనా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. అంటే అది ఒక ఔషధం. అంత మాత్రాన్న అన్ని జబ్బులకు ఆయుర్వేద మందులే శరణ్యం అని అనుకోకూడదు. అల్లోపతిలో ప్రతి మెడిసిన్‌పై ఏళ్ల తరబడి రిసెర్చ్ జరుగుతుంది. ఆయుర్వేదం సనాతనం, సంప్రదాయం అంటుంది. రెండింటీకి తేడా ఉంది" అని డాక్టర్ సూర్యారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Has the demand for ayurvedic products increased with the Anandayya Corona drug controversy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X