తొందరొద్దు, మోడీ 'అవతార్ 2' చూద్దాం: థరూర్‌కు డిగ్గీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో తొందరపడి నిర్ణయాలకు అభిప్రాయానికి రావొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. మోడీని ప్రశంసించడంపై శశి థరూర్‌ను కాంగ్రెస్ నేతలు విమర్శించిన నేపథ్యంలో దిగ్విజయ్ సలహా ఇచ్చారు.
తొందరపడి నిర్ణయాలకు రావొద్దని, మోడీ రెండవ అవతారంపై మనం తొందరపడి నిర్ణయాలకు రావడం సరికాదని, వేచి చూద్దామని శుక్రవారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. శశి థరూర్ నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ గురువారం ఆయన వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ సైతం శశిథరూర్‌ను ఊసరవిల్లి, పరిణతి లేని వ్యక్తి అంటూ విమర్శించారు. థరూర్‌లాంటి మేధావి ఈ విధంగా తొందరపడి వ్యాఖ్యలు చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని కూడా అయ్యర్ అన్నారు.
తన వ్యాఖ్యల పైన థరూర్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు మోడీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల్లాగే గతంలో ఆయనను విమర్శిస్తూ చేసిన ప్రతి వ్యాఖ్యకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో ఆయన చర్యలను గమనిస్తూ ఉంటామని థరూర్ గురువారం ట్విట్టర్‌లో అన్నారు.
అంతేకాక తీవ్రమైన ఆగ్రహంతో కాక మన వాదనల నాణ్యత ద్వారా మాత్రమే మనం విజయం సాధిస్తామనే విషయాన్ని భారత దేశ ఉదారవాదులు గుర్తుంచుకోవాలని కూడా ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ద్వేషించబడే వ్యక్తి అవతారం నుంచి ఆధునికత, ప్రగతికి ప్రతి రూపమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని శశి థరూర్ బుధవారం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications