వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిచిడీలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపేశాడు... చిన్న చిన్న కారణాలతో ఎందుకీ దారుణాలు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రతీకాత్మక చిత్రం

అల్పాహారంలో ఉప్పు ఎక్కువ వేసిందని తన భార్యను హత్య చేశారంటూ ఒక వ్యక్తిని గతనెలలో పోలీసులు అరెస్ట్ చేశారు.

"మహారాష్ట్రలోని థానేకు చెందిన నికేష్ ఘాగ్ బ్యాంకులో క్లర్కు. కిచిడీలో ఉప్పు ఎక్కువ వేసిందన్న కోపంతో అతను తన భార్య గొంతు నులిమి చంపేశాడు" అని పోలీసు అధికారి మిళింద్ దేశాయ్ బీబీసీకి చెప్పారు.

ఈ దారుణానికి 12 సంవత్సరాల వారి కుమారుడు సాక్షిగా ఉన్నాడు.

"ఉప్పు ఎక్కువ వేశావంటూ మా నాన్న.. మా అమ్మ వెనుకే బెడ్‌రూం వరకు వెళ్లాడు. తర్వాత అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు" అని ఆ రోజు జరిగిన ఘటనను అతను పోలీసులకు వివరించాడు.

"ఆ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మను కొట్టొద్దు నాన్న అంటూ తండ్రిని వేడుకుంటూనే ఉన్నాడు. కానీ నిందితుడు వినలేదు. తన భార్యను కొడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక తాడును ఆమె మెడ చుట్టూ వేసి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు" అని పోలీసు అధికారి మిళింద్ చెప్పారు.

తండ్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన తర్వాత ఆ పిల్లాడు తన అమ్మమ్మకు, ఇతర బంధువులకు ఫోన్ చేశాడు.

"మేము సంఘటన స్థలానికి చేరుకునే సరికే, బాధితురాలు నిర్మలను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది" అని మిలింద్ వెల్లడించారు.

ఆ తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ సమయంలో తనకు బీపీ పెరిగిందని చెప్పాడు. అతడ్ని పోలీసులు జైలుకు పంపించారు.

ఇంటికి సంబంధించిన విషయాల్లో నికేష్ దంపతుల మధ్య గత 15 రోజులుగా గొడవలు జరుగుతున్నాయని నిర్మల కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.

అయితే, దీనికి సంబంధించి బాధితురాలు లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసు అధికారి మిళింద్ తెలిపారు.

బాధిత మహిళ

ఆహారం బాలేదన్న కారణంతో భార్యను కొట్టడం, హత్య చేయడం వంటి ఘటనలు ఇండియాలో తరచూ కనిపిస్తూ ఉంటాయి.

  • రాత్రిపూట భోజనం వడ్డించనన్నందుకు తన భార్యను హత్య చేశారంటూ జనవరిలో నోయిడాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
  • 2021 జూన్‌లో, భోజనంతో పాటు సలాడ్ ఇవ్వలేదనే కోపంతో భార్యను హత్య చేశారంటూ యూపీలో మరొకరిని అరెస్ట్ చేశారు.
  • ఆ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత, ఫ్రైడ్ చికెన్ సరిగా వండలేదంటూ తన భార్యను చనిపోయే వరకు కొట్టారని బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి.
  • భోజనం ఆలస్యంగా వడ్డించారంటూ 60 ఏళ్ల వ్యక్తి తన భార్యను కాల్చివేశారని 2017లో బీబీసీ ఒక కథనం ప్రచురించింది.

ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. వెలుగులోకి రాని ఘటనలు ఇంకా చాలానే ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

"ఇలాంటి కేసుల్లో బాధితురాలి మరణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఇందులో లింగ ఆధారిత హింస 'అదృశ్యం'గా ఉంది" అని జెండర్ యాక్టివిస్ట్ మాధవి కుక్రెజా అన్నారు.


భార్యను కొట్టడాన్ని సమర్థించే వారి శాతం

భారత్‌లో మహిళలపై హింసకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో గృహ హింస కేసులే ఎక్కువ.

క్రైమ్ డేటా ప్రకారం 2020లో మహిళల నుంచి పోలీసులకు 1,12,292 ఫిర్యాదులు వచ్చాయి. అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు ఫిర్యాదు చేసినట్లు చెప్పొచ్చు.

అయితే, ఇలాంటి హింస కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భర్త, భాగస్వామి నుంచే ఈ హింస ఎక్కువగా ఎదురవుతోందని తెలిపింది.

భారత్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఈ హింస చుట్టూ ఉన్న మౌనంపై ఇక్కడి ఉద్యమకారులు పోరాటం చేయాల్సి వస్తోంది. అలాంటి హింస సహజమేననే అభిప్రాయం వ్యక్తమవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-(NFHS5) నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

అత్తమామలకు గౌరవం ఇవ్వకపోతే, ఇంటిని, పిల్లలను సరిగా చూసుకోకపోతే లేదా భర్తకు చెప్పకుండా బయటకు వెళ్తే లేదా సెక్స్‌కు నిరాకరిస్తే లేదా ఆహారం సరిగా వండకపోతే భార్యను భర్త కొట్టడంలో తప్పులేదని 40 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 38శాతం మంది పురుషులు చెప్పినట్లు NFHS5 సర్వే పేర్కొంది.

భార్యను భర్త కొట్టడాన్ని నాలుగు రాష్ట్రాల్లో 77శాతం కంటే ఎక్కువ మంది మహిళలు సమర్థించారు.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో భార్యను కొట్టడాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా సమర్థించారు. ఈ విషయంలో కర్ణాటకకు మాత్రం మినహాయింపు ఉంది.

సరిగా వంట చేయకపోతే భార్యను భర్త కొట్టడంలో తప్పులేదని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అభిప్రాయపడ్డారు.

అయితే, ఐదేళ్ల క్రితం నిర్వహించిన గత సర్వేతో పోలిస్తే ఈ గణాంకాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. గత సర్వేలో 52శాతం మంది మహిళలు, 42 శాతం మంది పురుషులు భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించారు.


భార్యను కొట్టడాన్ని సమర్థించే పురుషుల శాతం

కానీ సమాజం తీరు మాత్రం మారలేదని ఇండియాలో ఆక్స్‌పామ్ జెండర్ జస్టిస్ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న అమిత పిట్రే అన్నారు.

"మహిళలపై హింస, దాన్ని సమర్థించుకోవడం అనే వైఖరికి మూలాలు పితృస్వామ్యంలో ఉన్నాయి. లింగ ఆధారిత హింస చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియాలో మహిళలను పురుషులకంటే తక్కువగా చూస్తారు" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"మహిళలు ఎలా ప్రవర్తించాలన్న దానిపై కొన్ని స్థిరమైన సామాజిక భావనలు ఉన్నాయి. ఆమె ఎల్లప్పుడూ పురుషుడి కంటే తక్కువే. పురుషుడు చెప్పినట్టు ఆమె వినాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె అతనికి సేవ చేయాలి. భర్త కంటే తక్కువ సంపాదించాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా ఏ మహిళ ప్రవర్తించినా దాన్ని ఒప్పుకునే వారి శాతం చాలా తక్కువ. ఏ మహిళ అయినా ఈ పద్ధతులను ప్రశ్నిస్తే.. ఆమెకు 'తన స్థానం ఏంటో' భర్త గుర్తు చేస్తే, అందులో ఎలాంటి తప్పు లేదనే భావన సమాజంలో ఉంది" అని అమిత పిట్రే అన్నారు.

భార్యను కొట్టడాన్ని చాలామంది మహిళలు సమర్థించడానికి కారణం పితృస్వామ్యంలో పాతుకుపోయిన లింగ సంబంధమైన భావనలేనని ఆమె తెలిపారు.

"అత్తారింటికి వెళ్తున్నావు. చనిపోయినప్పుడు మాత్రమే ఆ ఇంటి నుంచి నువ్వు బయటకు రావాలంటూ కొత్త పెళ్లికూతురికి చాలామంది సలహా ఇస్తుంటారు. అందుకే భర్త తరచూ కొడుతున్నా, చాలామంది మహిళలు తన తలరాత ఇంతేనని అనుకుంటూ, ఆ హింసను మౌనంగా భరిస్తూ ఉంటారు" అని అన్నారు జెండర్ యాక్టివిస్ట్ మాధవి కుక్రెజా.

ఇలాంటి బాధిత మహిళల కోసం ఆమె బుందేల్‌ఖండ్‌లో వనన్గన అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

"గతంలో కంటే ఇప్పుడు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ ఇండియాలో చాలా ఘటనలు పోలీస్ స్టేషన్ వరకు రావడం లేదు. అలాంటి కేసులను ఫిర్యాదు చేయడం, నమోదు చేయడం కష్టం. ఎందుకంటే ఇంట్లో జరిగింది నాలుగు గోడల మధ్య ఉండిపోవాలని చాలామంది చెబుతారు. అందుకే బాధిత మహిళలు పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కకుండా ఇంట్లోవాళ్లు జాగ్రత్త పడుతుంటారు" అని మాధవి చెప్పారు.

ఒకవేళ అత్తారింటి నుంచి బయటకు వస్తే, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో కూడా బాధిత మహిళలకు తెలియని పరిస్థితి ఉంటుందని ఆమె వివరించారు.

"అత్తారింట్లో బాధపడుతున్న కూతుర్ని తమ ఇంటికి తీసుకెళ్లడానికి చాలా మంది తల్లిదండ్రులు తటపటాయిస్తుంటారు. వాళ్ల పేదరికం దానికి ఒక కారణం. తమ కుటుంబంలోకి మరొకరు వస్తే వారిని పోషించే స్థోమత వారికి ఉండదు. వారిని ఆదుకునే వ్యవస్థ పెద్దగా లేదు. షెల్టర్ హోమ్స్ తక్కువగా ఉన్నాయి. భర్తను వదిలి వచ్చే మహిళలకు అందే పరిహారం చాలా తక్కువ. పరిహారం రూ.500 నుంచి రూ.1500 మధ్యలో ఉంటుంది. తనకు, తన పిల్లలను పోషించుకోవడానికి ఒక మహిళకు ఇది ఏమాత్రం సరిపోదు" అని మాధవి అభిప్రాయపడ్డారు.

గృహ హింస బాధితులకు అండగా ఉంటోంది వనన్గన సంస్థ

భర్తలు కొట్టి, ఇంట్లోంచి గెంటేసిన ఇద్దరు మహిళలకు సంబంధించిన వివరాలను వనాంగన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పుష్ప శర్మ వివరించారు.

"ఈ రెండు కేసుల్లో ఆ మహిళల భర్తలు వారిని జుట్టు పట్టుకుని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చారు. ఇరుగుపొరుగు వారు చూస్తుండగా వారిపై దాడి చేశారు. వాళ్లు సరిగా వంట చేయలేదని చెప్పారు. కానీ వారు తరచూ చేసే ఫిర్యాదుల్లో ఇదీ ఒకటి. భోజనం అనేది కేవలం ట్రిగ్గర్ పాయింట్‌ మాత్రమే"

"మగ పిల్లాడికి కాకుండా ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు, అమ్మాయి నల్లగా పుట్టిందని, అందంగా లేదని, లేదా తగినంత కట్నం తీసుకురాలేదని, ఇంటికి వచ్చిన భర్తకు వెంటనే మంచినీళ్లు, భోజనం పెట్టలేదని, కూరలో ఉప్పు వేయడం మర్చిపోయినా, ఉప్పు ఎక్కువగా వేసినా భార్యలను కొందరు భర్తలు తరచూ కొడతారు" అని పుష్ప శర్మ చెప్పారు.

గృహ హింసపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 'నాకు సమాధానం చెప్పండి' అనే వీధి నాటకాన్ని వనాంగన సంస్థ 1997లో ప్రారంభించింది.

'ఓ.. పప్పులో ఉప్పు లేదు' అనే వాక్యంతో ఆ నాటకం మొదలవుతుందని చెప్పారు జెండర్ యాక్టివిస్ట్ మాధవి కుక్రెజా.

"25 సంవత్సరాల ప్రచారం తర్వాత సమాజంలో మార్పు కొద్దిగానే వచ్చింది. వివాహ బంధానికి మనం ఇచ్చే ఎక్కువ విలువే దీనికి కారణం. వివాహ బంధాన్ని నిలబెట్టేందుకు మనం శాయశక్తులా ప్రయత్నిస్తాం. పెళ్లి అనేది పవిత్ర బంధం. అది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం"

"అలాంటి భావాలు మారాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలి. హింసను భరించాల్సిన పరిస్థితిని వారికి కల్పించకూడదు" అని మాధవి అన్నారు.


డేటా, గ్రాఫిక్స్: షాదాబ్ నజ్మి

గృహ హింస ఎదుర్కొంటున్న వాళ్లు సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:

పోలీస్ హెల్ప్‌లైన్: 1091/ 1291

జాతీయ మహిళా కమిషన్ వాట్సాప్ హెల్ప్‌లైన్: 72177-35372

దిల్లీలోని శక్తి షాలిని ఎన్జీవో హెల్ప్‌లైన్: 10920

ముంబైలోని స్నేహ ఎన్జీవో హెల్ప్‌లైన్: 98330-52684 / 91675-35765

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
He killed his wife because there was too much salt in Kichidi,Why atrocities for small reasons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X