జయలలిత పిటిషన్‌పై విచారణ: భారీ బందోబస్తు
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న జయలలిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులోని 14వ బెంచ్‌లో విచారణ ప్రారంభం కానుంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గత నెల 27న జయలలితను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వందకోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఆ వెంటనే 29న బెయిల్ కోసం జయలలిత తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీతో పాటు తమిళ న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నించారు. వెకేషన్ బెంచ్‌లో పూర్తి స్థాయి విచారణ సాధ్యం కాదని పేర్కొంటూ న్యాయమూర్తి రత్నకళ 6వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈలోగా బక్రీదు పండుగను పురస్కరించుకుని 6న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో 7వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా జయలలిత జైలుకెళ్లి 10రోజులు పూర్తయింది.

మంగళవారం బెయిల్‌పై విచారణ జరగనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందా లేకుంటే ఇంకా విచారణ జరపాల్సి ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసుపై ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించినందున సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు.
బెయిల్‌పై మంగళవారం విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయోనని నగర పోలీసు శాఖ హైకోర్టు ప్రాంగణంతో పాటు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు చేపట్టింది. తమిళనాడు-బెంగళూరు ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
హైకోర్టు ప్రాంగణంలోకి కూడా ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు హైకోర్టు ప్రాంగణాన్ని సోమవారం పరిశీలించారు. కాగా జయ తరపున వాదిస్తున్న న్యాయవాది రాంజెఠ్మలానీ ఇప్పటికే నగరానికి వచ్చినట్లు సమాచారం. ఆయనతో పలువురు తమిళ న్యాయవాదులు కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications