మళ్లీ ముంచెత్తిన వానలు.. భారీ ట్రాఫిక్ జాంతో జనం అవస్థలు..
Recommended Video
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గత వారం కురిసిన వర్షాల నుంచి కోలుకోకముందే నగరాన్ని మరోసారి భారీ వానలు ముంచెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జనం ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జాం కావడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రూఫ్ కూలి 8మందికి గాయాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శివాజీ నగర్‌లో ఇంటి రూఫ్ కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే వర్షాల కారణంగా ట్రైన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సబర్బన్ ఏరియాలకు నడిచే లోకల్ రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని స్పష్టం చేసింది. అయితే రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేకుండా వాన పడుతుండటంతో రోడ్లన్నీ మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు.

విమానాల రాకపోకలపై ప్రభావం
మరోవైపు ప్రతికూల వాతావరణం ముంబై ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలపై పడింది. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మబ్బులు దట్టంగా కమ్మేయడంతో ఉదయం పది దాటినా చీకటిగానే ఉండటంతో పలు విమానయాన సంస్థలు సర్వీసులు రద్దు చేశాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్యాసింజర్లు ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి.

కొనసాగనున్న భారీ వర్షాలు
ముంబైలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు చోట్ల కుండపోత వానలు పడతాయని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాసిక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గతవారం మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా 40మంది మృత్యువాతపడ్డారు.












Click it and Unblock the Notifications