శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు బిగ్ అలర్ట్- భారీ వర్షాలు..!!
Bay of Bengal: వరుస అల్పపీడనాలు, తుఫాన్లు తాకిడి కొనసాగుతూ వస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి దాదాపు రెండు నెలల నుంచి. ప్రతి సంవత్సరం నవంబర్/డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమే అయినప్పటికీ- ఇప్పుడు దీని తీవ్రత మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా కడలూరు, మైలాడుథురై, నాగపట్నం, కరైకల్, చెంగల్పట్టు, విల్లుపురంలల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరువారూరు, తంజావూరు, కాళ్లకురిచ్చి, అరియలూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి.

ఇదే తీవ్రత అటు కేరళలోనూ నెలకొంది. మూడు జిల్లాలకు వాతవరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పత్తినంథిట్ట జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సముద్రంపై చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది.
వచ్చే రెండు రోజుల్లో తిరువనంతపురం, కొల్లం, పత్తినంథిట్ట జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అళప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీ మీటర్ల మేర వర్షం పడొచ్చని పేర్కొంది. ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాల తీవ్రత శబరిగిరులపైనా తీవ్రంగా పడింది. ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. ఫలితంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. వర్షాల తీవ్రతకు కల్వర్టులు పొంగిపోర్లడం, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటం, వంటి సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి.
గురు, శుక్రవారాల్లో శబరిమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సన్నిధానం- 68, నీలక్కల్- 73, పంబ- 12.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల కారణంగా పంబ నదీ పొంగిపొర్లుతోంది. భారీగా వరదపోటుకు గురైంది. నదిలో పుణ్యస్నానాలను ఆచరించే భక్తులకు అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక సిబ్బంది, పోలీసులు మైకుల ద్వారా హెచ్చరిస్తోన్నారు.
ఇలాంటి పూర్తి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అయ్యప్ప స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకుంటోన్నారు భక్తులు. భక్తి ప్రపత్తులతో ఇరుముడిని స్వామివారికి సమర్పించుకుంటోన్నారు. శుక్రవారం రాత్రి నాటికి 78, 483 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications